సిద్దిపేట,అక్టోబర్27 : నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మూడుసార్లు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేసి, నేడు అధికారంలోకి రాగానే రైతులకు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు( Harish Rao) విమర్శించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ పారుఖ్ హుస్సేన్‌తో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF checks) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపడచులకు రెండు బతుకమ్మ చీరలు ఇస్తామని ఒకటి కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టిందని మండిపడ్డారు.
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కేసీఆర్ హయాంలో వానకాలం, యాసంగికి రైతుబంధు ఇచ్చారన్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని, తులం బంగారం దేవుడెరుగు కల్యాణ లక్ష్మి కూడా ఇవ్వట్లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలు కావొస్తుంది. కానీ, 25000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. పీఆర్సీ ఇస్తామన్నారు కాని దానిని కూడా ఇవ్వలేదన్నారు. పేదొడికి ఇళ్లు ఇవ్వకుండా.. ఉన్న ఇండ్లను కూడా కూలగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మాయమాటలతో నమ్మించారు. ప్రజలు నమ్మి ఓటేస్తే గొంతుకోస్తున్నారని మండిపడ్డారు.