వనపర్తి, మార్చి 4 (నమస్తే తెలంగాణ)/నాగర్‌కర్నూల్/కొల్లాపూర్: జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయాన్ని కేంద్రం కొల్లగొడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఏమీలేవని, రాష్ర్టాల సముదాయమే కేంద్రమని స్పష్టంచేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ పట్టణంతోపాటు కొల్లాపూర్‌లో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతితో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు. దేశంలో ఇదే కోవకు చెందిన పార్టీలు రెండు,మూడు ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్తో సరితూగేవి తమిళనాడులోని డీఎంకే, పంజాబ్‌లోని అకాలీదళ్, మహారాష్ట్ర లో శివసేన పార్టీలని అన్నారు. దేశ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని స్పష్టంచేశారు. నాడు అంబలి కేంద్రాల్లో ఆకలి తీర్చుకొన్నామని, కేసీఆర్ పాలనలో నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని చెప్పారు. ప్రాజెక్టులతో పాలమూరు సస్యశ్యామలం అయ్యిందని, ప్రజల కండ్లల్లో ఆనందం చూస్తున్నామని చెప్పారు. ఈ నెల 8న వనపర్తిలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.