Sugar | మనం ఆహారంలో భాగంగా చక్కెరను కూడా తీసుకుంటూ ఉంటాం. టీ, కాఫీ వంటి వాటితో పాటు తీపి వంటకాల తయారీలో కూడా చక్కెరను విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. చక్కెరతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి, వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చక్కెరను తీసుకోవడం వల్ల డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్య ఒక్కటే వస్తుందని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ చక్కెర మన శరీరంలో అన్ని అవయవాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్యంపై చక్కెర తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గుండె, కాలేయం, మెదడు, చర్మం ఇలా అన్ని అవయవాలపై చక్కెర చెడు ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ లక్షణాలు మనకు వెంటనే కనిపించవు. కానీ కాలక్రమేణా మనం చక్కెర దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చక్కెర మన శరీరంలో వివిధ అవయవాలపై ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహానికి చక్కెర ఒకే ఒక కారణం కాకపోయినప్పటికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అధిక చక్కెరను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీని వల్ల మధుమేహాన్ని నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లు, మూత్రపిండాలు, నరాలు, గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. దీర్ఘకాలం పాటు ఉండే ఊబకాయం క్యాన్సర్ కు కూడా దారి తీస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల 60 నుండి 95 శాతం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక చక్కెర తీసుకోవడం తగ్గించాలి. ఇక చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
రోజువారి చక్కెర పానీయాల వినియోగం లిపిడ్ ప్రొఫైల్ తో కూడా ముడిపడి ఉంటుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ల ప్రమాదాన్ని పెంచుతుంది. మన శరీరంలో ఉండే కాలేయం చక్కెరలో ప్రధానమైన ప్రక్టోజ్ ను ప్రాసెస్ చేస్తుంది. అధికంగా చక్కెరను తీసుకోవడం వల్ల కాలేయ కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఫ్యాటీ లివర్ కు దారి తీస్తుంది, ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోకి క్యాలరీలు ఎక్కువగా వచ్చి చేరతాయి, చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కూడా కలగదు. ఇది మనం అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తుంది. అదనపు చక్కెర ఇన్సులిన్, లెప్టిన్ అనే హార్మోన్లకు కూడా అంతరాయాన్ని కలిగిస్తుంది. దీంతో శరీర బరువు పెరుగుతుంది. రక్తంలో చక్కెర పెరుగుదల, క్రాష్ లు న్యూరోట్రాన్స్ మిటర్ లను ప్రభావితం చేస్తుంది, మెదడులో వాపును పెంచుతుంది. తద్వారా మానసిక సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
చక్కెర తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది జ్ఞాపకశక్తి తగ్గేలా కూడా చేస్తుంది. చక్కెర ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడు క్షీణత వేగవంతంగా జరుగుతుంది. అలాగే చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ తో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇవి రెండూ కూడా మూత్రపిండాలపై తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. కాలక్రమేణా ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. అతిగా చక్కెరను తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మంపై మంట, వృద్దాప్య ఛాయలు ఎక్కువగా వస్తాయి. దంతాల సమస్యలు కూడా పెరుగుతాయి. చిగుళ్ల సమస్యలతో పాటు దంతాలు పుచ్చిపోవడం వంటివి కూడా జరుగుతాయి. ఇలా చక్కెర మన శరీరంలో ఉండే అన్ని అవయవాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కనుక చక్కెర, చక్కెర ఉండే ఆహారాలను, శీతల పానీయాలను తక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.