మర్రిగూడ : యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) ఆవేదన వ్యక్తం చేశారు. యూరియ కొరతను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో మెరుపు ధర్నాకు (Farmers Protest ) దిగారు. దీంతో ఇరువైపుల గంటపాటు వాహనాల రాకపోకలు స్థంభించిపోయయి. రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చదువురాని రైతులు స్మార్ట్ ఫోన్లో యూరియాను ఎలా బుక్ చేసుకుంటారని మండిపడ్డారు. మొన్నటి వరకు పత్తి రైతులు స్లాట్ బుకింగ్‌తో ఇబ్బందులు పడి పత్తి పంటను దళారులకే విక్రయించారని గుర్తు చేశారు. సీజన్ మొదలుకాగానే అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు ఎటుపోయిందని ప్రశ్నించారు. పంటల సమయంలో రాని రైతు భరోసా ఓట్ల సమయంలో గుర్తుకు రావడం సిగ్గుచేటని విమర్శించారు.
యాప్ లో కనిపించిన యూరియా షాపుల్లో ఎందుకు దొరకడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్‌తో ఆధార్ కార్డు పంపితే యూరియా ఇంటికి వచ్చేదని చెప్పారు. ఆధార్ కార్డు ప్రామాణికంగా రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు మునుగోడు వ్యవసాయ సంచాలకుడు వేణుగోపాల్, ఏవో సహస్, ఎస్సై కృష్ణారెడ్డి తరలి వచ్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ, సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు రాపోలు యాదగిరి, జిల్లా నాయకుడు చెరుకు శ్రీరామ్ గౌడ్, మాజీ కోఆప్షన్స్ సభ్యులు ఎండి యాకూబ్ అలీ, ప్రధాన కార్యదర్శి వట్టి కోటి శేఖర్, యూత్ అధ్యక్షుడు ఆంగోతు హరి ప్రసాద్ నాయక్, నాయకులు వనమాల మహేష్, పగడాల రఘు, నల్ల శేఖర్, పోలే సైదులు, బండ రమేష్, కొండాపురం నరేష్, మాద సత్తయ్య, గుణగంటి నగేష్, కోన్ రెడ్డి యాదయ్య, నల్ల వెంకటయ్య, మహేశ్వరం సోకయ్య, రైతులు పాల్గొన్నారు.