High Cholesterol | నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తుతుంది. వయసు పైబడిన వారితో పాటు యువతలో కూడా మనం ఈ సమస్యను చూడవచ్చు. అధిక కొలెస్ట్రాల్ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొత్తం శరీర ఆరోగ్యంపై అధిక కొలెస్ట్రాల్ ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు ఇంకా పెరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనుక కొలెస్ట్రాల్ ఉన్న ఆహరాలను తీసుకోవడం పరిమితం చేయాలి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడే వారు పరిమితంగా తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. వీటిలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా వెన్నను తీసుకోవడం తగ్గించాలి. ఒక టేబుల్ స్పూన్ వెన్నలో 7.3 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో 6 శాతం కంటే ఎక్కువగా సంతృప్త కొవ్వులు లేకుండా చూసుకోవాలి. ఉదాహరణకు మనం 2,000 క్యాలరీల ఆహారం తీసుకుంటే దానిలో 11 నుండి 13 గ్రాముల కంటే సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కనుక పాలు, పాల ఉత్పత్తులను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలోకి సంతృప్త కొవ్వులు ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి.
అదే విధంగా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు మాంసాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. మాంసంలో కూడా సంతృప్త కొవ్వులు ఉంటాయి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. వీటిలో కొవ్వులతో పాటు ప్రిజర్వేటివ్స్, రసాయనాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్పర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక వేయించిన ఆహారాలను కూడా తీసుకోవడం తగ్గించాలి. వీటిలో అధిక మొత్తంల క్యాలరీలతో పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు హానిని కలిగిస్తాయి. కనుక నూనెలో వేయించిన ఆహారాలను తీసుకోవడం అంత మంచిది కాదు. బదులుగా ఎయిర్ ఫ్రైయర్ ను వాడడం మంచిది. అలాగే ఆలివ్ నూనెతో పాన్ లో వేయించి తీసుకోవడం మంచిది.
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరగకుండా కాపాడుకోవచ్చు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేయడం చాలా కష్టం. అయితే కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలను తీసుకోవడం పరిమితం చేయడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.