ఖలీల్‌వాడి, డిసెంబర్ 1 : రేవంత్‌రెడ్డి బై డిఫాల్డ్ ముఖ్యమంత్రి అయ్యాడని, రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్ సమావేశంలో ఫ్రస్ట్రేషన్, పరేషాన్లో ఏమేమో మాట్లాడారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులను నిండా ముంచి రైతు పండుగ చేసుకోవటంలో అర్థం లేదని అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే దేశంలోనే అత్యంత వేగంగా గ్రాఫ్ పడిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలు అమలు చేయలేక నిత్యం కేసీఆర్ మీద పడి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
రాష్ట్రంలో రుణమాఫీ రైతులందరికీ కాలేదన్న సంగతి రుణమాఫీ కానీ రైతులకు తెలుసని చెప్పారు. ఎన్నికల సమయంలో 60 లక్షల మంది రైతులకు 40 రూ. వేల కోట్ల రుణమాఫీ అని అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో 24 లక్షల మంది రైతులకు కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని వివరించారు. ఇంకా 36 లక్షల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతి రైతుకు రేవంత్‌రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఎకరానికి ఎగ్గొట్టిన రూ.12 వేల బోనస్, రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుబంధును ఎగ్గొట్టే కుట్ర చేస్తుందనడానికి తుమ్మల నాగేశ్వర్రావు మాటలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రభు త్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతంచేస్తారని చెప్పారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంటే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు.