హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్న వారికి మళ్లీ నిరాశే మిగిలింది. ఢిల్లీ పర్యటనకు 28వసారి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఉత్త చేతులతోనే తిరిగొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అపాయింట్మెంట్ కోసం 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. కానీ రాహుల్ అపాయింట్మెంట్ తిరస్కరించగా ఏఐసీసీ పెద్దలు కనీసం మొహం చూసేందుకు ఇష్టపడలేదని గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. సీఎం కంటే ముందు ఢిల్లీ వెళ్లిన ఇద్దరు మంత్రులో రాహుల్‌తో భేటీ అయ్యారు. రేవంత్ పాలన వైఫల్యాలపై చెప్పినట్టు తెలుస్తున్నది. కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ సమయంలోనే ఫార్మలా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతించారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
ప్రజల ఆకాంక్ష మేరకే వర్గీకరణ ; గ్లోబల్ మాదిగ-2024లో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో మాదిగలకు అనుకూల నిర్ణయం తీసుకున్నాం. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును తు.చ. తప్పకుండా అమలు చేస్తామని అసెంబ్లీలో వెల్లడించాం. అయితే ఈ సమస్య జఠిలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్ష మేరకు ముందుకెళ్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ హాటోల్లో శనివారం నిర్వహించిన ‘గ్లోబల్ మాదిగ-2024’ లో రేవంత్ పాల్గొన్నారు. కోకాపేటలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కురుమ భవనాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించామని చెప్పారు.