సిద్దిపేట, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన వారూ అసహనంతో వెనుదిరగడంతో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభాస్థలికి చేరుకునే సరికే ఖాళీకుర్చీలు మిగలడంతో వాటికే తన ప్రసంగాన్ని అప్పజెప్పారు. మధ్యాహ్నం ప్రారంభం కావాల్సిన సభ మూడు గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఇటు కాంగ్రెస్ శ్రేణులూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. కుర్చీల వరుసలు., కాంగ్రెస్ కార్యకర్తల కాస్తోకూస్తో గుంపులే తప్ప ప్రాంగణంలో కనిపించిన వారే లేకపోవడంతో రేవంత్రెడ్డి చెప్పాల్సినదంతా వారికే బలవంతంగా వినిపించారు. కాగా, వెళ్తున్న ఆ కాస్త మందిని దయచేసి వెళ్లొద్దు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బతిమిలాడిన తీరుపై అంతా నవ్వుకున్నారు.
హుస్నాబాద్ లో నిర్వహించిన విజయోత్సవ సభలో అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం., ప్రభుత్వ పథకాలు పొందిన వారిని భయపెట్టి పిలిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే సీఎం రేవంత్రెడ్డి చేసిన శంకుస్థాపనలో చాలా వరకు గ్రామాలను ప్రభావితం చేసేవే ఉండడం గమనార్హం. విజయోత్సవ సభ అధికారిక కార్యక్రమమే అయినా సభా వేదికపై ఎన్నికలను ప్రభావితం చేసే మాటలు ఉండడం, పలువురు అర్హత లేని నాయకులు వేదికను పంచుకోవడంపై కూడా సాక్షాత్తు పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. సీఎం సభా నేపథ్యంలో సుమారు 150కిపైగా ఆర్టీసీ బస్సులను కేటాయించడంపై కూడా సామాన్య జనాలతో పాటు ప్రయాణికులు తీవ్ర నిరసన వెలిబుచ్చారు.
సీఎం పర్యటన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్, బీసీ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘం నేతలను ఠాణాకు తరలించారు. శంకరపట్నం మండలంలో కూడా పలువురు బీసీ సంఘం నేతలను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.