హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు మంత్రిపదవులు ఆశించడం, ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వీరి గైర్హాజరీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్సీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు ఈ భేటీకి రాలేదని తెలిసింది. వీరిలో రాజగోపాల్‌రెడ్డి సోమవారమే విదేశాలకు వెళ్లిపోయినట్టు సమాచారం. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో ముఖ్యమంత్రే వారిని రావొద్దని చెప్పారా? లేక వేరే ఏదైనా కారణం ఉన్నదా? అన్న చర్చ జరుగుతున్నది. ఇటీవల మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తూ వచ్చారు. కొందరు సామాజికవర్గాల వారీగా విడిపోయి లేఖాస్ర్తాలు సంధించగా.. మరి కొందరు మీడియా ముందుకో.. ప్రజాక్షేత్రంలోకో వెళ్లి నోటికి పని చెప్పినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. ఇటువంటి చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, తక్షణమే ఫుల్స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆ పార్టీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్‌ను ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకే సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్పీ భేటీ ఏర్పా టు చేశారని చెప్తున్నారు.
అందుకే సీఎం రావొద్దన్నారా?..
తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రచ్చచేయగా.. పదేళ్లు పార్టీని కాపాడుకు న్న తమను కాదని.. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌సాగర్‌రావు పరోక్షంగా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. ఇక గడ్డం వివేక్.. తాను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అయ్యే వాడినని కౌం టర్ ఎటాక్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై సీరియస్ అయిన అధిష్ఠానం.. సీఎల్పీ పెట్టి మాస్ వార్నింగ్ ఆవ్వాలని ఆదేశించటంతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగా వివాదాస్పద ఎమ్మెల్యేలను ఈ భేటీకి రావొద్దని మౌ ఖిక ఆదేశాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
బ్లాక్మెయిల్ చేస్తామంటే భయపడదు..
ఇక సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, పార్టీని బ్లాక్మెయిల్ చేస్తామంటే కుదరదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకాలలో అధిష్ఠానం నిర్ణయమే అంతిమం అని, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని, ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం జరుగుతుంటే.. ఎమ్మెల్యేలు స్పందించటం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ముఖం చాటేసిన ఫిరాయింపుదారులు..
బీఆర్ఎస్ పార్టీ నుంచి గోడ దూకిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఈసారి కూడా సీఎల్పీ భేటీకి ముఖం చాటేశారు. భద్రాచలం ఎమ్మెల్యేల తెల్లంవెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రమే వచ్చినట్టు తెలిసింది.
ఫిరాయింపుదార్లకు మినహాయింపు..
పార్టీ ఎమ్మెల్యేలు తమ నెల జీతం నుంచి రూ.25 వేలు పార్టీ ఫండ్ కోసం చందా ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గోడదూకిన ఫిరాయింపుదారులకు ఈ చందాల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో వారి కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఫిరాయింపుదారులు పార్టీకి ఇచ్చిన చందాలను కోర్టు ఆధారంగా స్వీకరించే అవకాశం ఉన్నది.
సీఎంకు తప్పిన ప్రమాదం
నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీకి వచ్చిన ఆయన లిఫ్ట్‌లో వెళ్తుండగా.. సాంకేతిక లోపంతో అది కిందకుదిగింది. ఎనిమిది మంది ఎకాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎకడంతో ఓవర్ వెయిట్ కారణంగా స్వల్పంగా కిందకు కుంగిపోయింది. దీంతో మరో లిఫ్ట్‌లో సీఎం రేవంత్‌ను పంపించారు. ఇది సీఎం సెక్యూరిటీ అధికారుల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి.