హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంతో ఉత్సాహం ఉన్నా నిధుల కొరత ఉన్నదని, అయినప్పటికీ సర్దుబాటు చేస్తూ నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇంజినీర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇరిగేషన్‌శాఖలో ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్), జేటీవో (జూనియర్ టెక్నికల్ ఆఫీసర్) పోస్టులకు ఎంపికైన 423మంది అభ్యర్థులకు నియామక పత్రాల అందించే కార్యక్రమాన్ని ఎర్రమంజిల్‌లోని జలసౌధలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఇంజినీర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలని కోరారు. ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందుకే ఖాళీలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటివరకు నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంజినీర్లు రాజకీయ నేతలు చెప్పినట్టు చేస్తే ఊచలు లెక్కించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గ్రూప్-1 నియామకాలను పరీక్షతో సంబంధం లేనివారే అడ్డుకుంటున్నారని, కోర్టుల్లో కేసులు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. త్వరలోనే అన్ని అడ్డంకులను అధిగమిస్తామని, గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నూతన ఏఈ, జేటీవో అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేశారు.