మళ్లీ అదే ఎత్తుగడ.. మళ్లీ అదే నోటి దురుసు.. సచివాలయం ముందు అమరవీరుల స్థూపం పక్కన… గతంలో తెలుగుతల్లి విగ్రహం ఉన్నచోట మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని తెలంగాణ సమాజం, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీక అయిన తెలుగుతల్లి విగ్రహం ఉన్న ప్రదేశంలో తెలంగాణ తల్లిని స్థాపించినప్పుడే తెలంగాణ అస్తిత్వభావన పరిపూర్ణమవుతుందని విజ్ఞప్తి చేస్తూవచ్చాయి. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరుమీద రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రతీకలు ఉన్నందున ప్రత్యేకంగా అక్కడే ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదన్నది తెలంగాణ వాదుల భావన. వాస్తవం ఇది కాగా, దీనిపైనా రేవంత్ వక్రభాష్యం మొదలుపెట్టారు. తెలుగుతల్లి విగ్రహం ఉన్న ప్రదేశంలో కేసీఆర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ ఆలోచిస్తున్నారంటూ ఊహాకల్పన చేశారు. తన మెదడుకు తోచిందే నిజమని భావించి కేసీఆర్‌పై నోరుపారేసుకున్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బడిపిల్లలు ఉన్నారన్న విషయం మరిచి చెప్పలేని, రాయలేని భాషలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తిట్టిపోశారు.
హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి ఎక్కడ, ఎవరి ముందు ఏం మాట్లాడాలనే సోయి కూడా ఉండడం లేదు. స్కూల్ పిల్లల ముందు బజారు భాష మాట్లాడుతున్నారు. తాను సీఎంననే ఇంగితం మరచి రోత మాటలు మాట్లాడుతున్నారు. అది కూడా పలకలేని, పత్రికలో రాయలేని భాషను మాట్లాడుతుండడం గమనార్హం. మంగళవారం సోమాజీగూడ చౌరస్తాలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. వందలమంది స్కూలు పిల్లల ముందు మాట్లాడుతూ బూతు పురాణం అందుకున్నారు. తాగుబోతులు, సన్నాసులు, వాడు, వీడు, అయ్య.. అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. పిల్లల ఎదుట సీఎం ఇలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఏ కార్యక్రమం.. ఏం మాట్లాడారు?
మంగళవారం జరిగింది మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి. అక్కడ మాట్లాడాల్సింది ఆయన గురించి.. దేశానికి ఆయన అందించిన సేవల గురించి. కార్యక్రమానికి హాజరైన బడిపిల్లలకు రాజీవ్ గొప్పతనం గురించి చెబుతూ వారిలో స్ఫూర్తి రగిలించాల్సిన సీఎం సమయం సందర్భం లేకుండా మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. పదేండ్లపాటు రాష్ర్టాన్ని పాలించి అభివృద్ధిలో పరుగులు పెట్టించిన నేత చావు కోరేలా మాట్లాడారు. సచివాలయం ఎదుట కేసీఆర్ విగ్రహం పెడదామనుకున్నారంటూ.. రాయలేని, చెప్పలేని భాషలో మాట్లాడారు. సెక్రటేరియట్ వద్ద ఆయన విగ్రహం పెట్టి సమాజానికి ఏం సందేశమివ్వాలనుకుంటున్నారని కూడా సీఎం ప్రశ్నించారు.
అసలు కేటీఆర్ ఏమన్నారు?
సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ప్రతిపాదిత ప్రదేశంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని ఆయన విగ్రహాన్ని ఎలా పెడతారని, తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగించడంతోపాటు శంషాబాద్ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్ పేరును కూడా తొలగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, రాజీవ్, ఇందిర పేర్లతో ఉన్న ఇతర పథకాల పేర్లను కూడా మారుస్తామని చెప్పారు. నిజానికి సచివాలయం ఎదురుగా అంబేద్కర్, అమరవీరుల స్థూపం ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తెలంగాణ పోరాటానికి అర్థవంతంగా ఉంటుందనేది కేటీఆర్ భావన.
తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు సబబు కాదన్నది కేటీఆర్ వాదన. అక్కడ రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసి ఆయన జయంతి నాడు రాహుల్‌గాంధీని పిలిచి ఆవిష్కరించి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలని, తద్వారా పడిపోతున్న గ్రాఫ్‌ను నిలబెట్టుకోవాలని రేవంత్ భావించారు. తెలంగాణ సమాజం నుంచి దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రస్తుతానికి అలాంటి పనిలేకుండానే, రాహుల్‌ను పిలవకుండానే రాజీవ్ జయంతిని నిర్వహించాల్సి వచ్చింది. ఇది రేవంత్‌లో ఫ్రస్ట్రేషన్‌కు కారణమైంది. అదే మరింత పెరిగి నోటి వెంట బూతులు రావడానికి కారణమైందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, నిరసనలతో వెనక్కి తగ్గిన సీఎం ఆ తర్వాత సచివాలయంలో సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు తగిన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
సభ ఏదైనా.. బూతు పురాణమే
సీఎం రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. సీఎం కాకముందు కూడా ఆయన మాటలు ఇలానే ఉండేవి. రాజకీయ సభ అయినా, ప్రభుత్వ సభ అయినా, అక్కడ మహిళలు ఉన్నా, పిల్లలు ఉన్నా ఆయన భాష మాత్రం మారడం లేదు. రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనంతోనే ఇలాంటి భాషను వాడుతున్నట్టు రాజకీయ, మేధావి వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీలో లుకలుకలు, ప్రభుత్వంలో పూర్తిగా పట్టు సాధించలేకపోవడం వల్లే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్టు చెప్తున్నారు. మేధావులు సైతం సీఎం తీరుపై మండిపడుతున్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని గుర్తించుకుని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.