Aamir Khan | బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అమీర్ ఖాన్ తన 61వ పుట్టినరోజును (మార్చి 14) కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆయన ఈ వేడుకను నిర్వహించడం విశేషం. ఇంట్లోనే జరిగిన ఈ సాదాసీదా సెలబ్రేషన్స్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని ఆనందంగా గడిపారు. ఈ వేడుకలో అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో పాటు ఆయన పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్, ఆజాద్ రావు ఖాన్ పాల్గొన్నారు. విశేషమేమిటంటే, అమీర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా మరియు కిరణ్ రావు కూడా ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి ఆత్మీయంగా గడపడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోను టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన తన భార్య సఫా బేగ్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. వీడియోలో అమీర్ ఖాన్ సింపుల్‌గా స్ట్రిప్డ్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్లో కనిపించగా, గౌరీ స్ప్రాట్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో మెరిశారు. కేక్ కట్ చేసే సమయంలో ఐరా ఖాన్ కొవ్వొత్తికి బదులుగా లైటర్ వెలిగించగా, అమీర్ దానిని ఊదుతూ నవ్వులు పూయించారు. అనంతరం ఐరా తన తండ్రి ముఖానికి కేక్ పూసి సరదాగా అల్లరి చేసింది. తర్వాత అమీర్ తన చేతులతో ముందుగా ఆజాద్‌కు, ఆ తర్వాత ఐరా, గౌరీ, జునైద్‌లకు కేక్ తినిపించారు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ, “అమీర్ భాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఐరా ఖాన్ తన అగత్సు ఫౌండేషన్ ద్వారా మానసిక ఆరోగ్యంపై చేస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయం” అని పేర్కొన్నారు. అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సినీ పరిశ్రమ నుంచి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కిరణ్ రావు అమీర్ ప్రొడక్షన్ హౌస్ వీడియోను షేర్ చేస్తూ, “నా ఫరెవర్ సికందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. అలాగే అమీర్ ఖాన్‌తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కాజోల్ కూడా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయనకు విష్ చేశారు. ఇదిలా ఉంటే, లాల్ సింగ్ చడ్డా తర్వాత కొంత విరామం తీసుకున్న అమీర్ ఖాన్ గత ఏడాది ‘సితారే జమీన్ పర్’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన నిర్మాణ రంగంలోనూ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం సన్నీ డియోల్ నటిస్తున్న ‘లాహోర్ 1947’ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’లో అతిథి పాత్రలో కనిపించారు.