Niranjan Reddy | అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి కానీ.. రాజకీయ నాయకుల కొమ్ముకాయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను ఎగ్గొట్టిన మొదటి సీఎం రేవంత్ రెడ్డినే అని స్పష్టం చేశారు. రైతులు రైతు భరోసాపై ఆశలు వదులుకున్నారని తెలిపారు. ప్రశ్నించేవారిని అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ మేరకు రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
సంక్షేమ పథకాలు అమలు కానప్పుడు తిరగబడటం ప్రజల హక్కు అని నిరంజన్ రెడ్డి తెలిపారు. సకాలంలో కరెంట్, యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని అన్నారు.
సోషల్మీడియాలో ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. రెండున్నరేళ్లయినా శ్రీధర్ రెడ్డి హత్య కేసు తేల్చకపోవడం శోచనీయమని విమర్శించారు. వారం రోజుల్లో శ్రీధర్ రెడ్డి హత్య కేసు తేల్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రామన్నగట్టు రిజర్వాయర్ శంకుస్థాపన చేసినా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. డీ5, డీ8 కాల్వలు ఆధునీకరించడం ద్వారా సాగునీళ్లను పెంచే అవకాశం ఉందని తెలిపారు.
ఇరిగేషన్ చీఫ్ అందుబాటులో లేక సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. జిల్లా మంత్రులకు కక్ష సాధింపు చర్యలు తప్ప.. ప్రజా సంక్షేమం పట్టదని అన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏదుల రిజర్వాయర్ను రెండేండ్లలోనే పూర్తి చేశామని తెలిపారు. రెండు టీఎంసీల రామన్న గట్టు రిజర్వాయర్ను కాంగ్రెస్ పూర్తి చేయలేకపోతున్నదని అన్నారు.