హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (ఎఫ్డీసీ) జారీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. 119 నియోజకవర్గాల్లో ఈ నెల 3వ తేదీ నుంచి ఐదు రోజులపాటు సర్వే చేయాలని ఆదేశించారు. ఎఫ్డీసీ అం శంపై సీఎం రేవంత్రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టు కోసం ప్రతి నియోజకవర్గం నుంచి ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఒకవేళ పూర్తిగా పట్టణ/నగర నియోజకవర్గమైతే రెండు వార్డు లు/ డివిజన్లు, పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైతే రెండు గ్రామాల్లో సర్వే చేయాలని, మొత్తంగా 238 ప్రాంతాల్లో సర్వే సమర్థం గా నిర్వహించాలని ఆదేశించారు.
కుటుంబసభ్యులు అందరూ సమ్మతిస్తేనే కుటుంబం ఫొటో తీయాలని, లేకుంటే ఫొటో తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని, అప్పుడే పకడ్బందీగా కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కుటుంబసభ్యుల వివరాల నమోదు, మార్పులుచేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పొరపాట్లకు తావివ్వవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సానుకూలతలు, ఇబ్బందులతో నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. దానిపై చర్చించిన అ నంతరం లోపాలను సవరించి సర్వేకు శ్రీకారం చుట్టాలని సూచించారు.