CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: విద్యపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఎక్కువ మొత్తం టీచర్ల జీతాలకే వెళ్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నామని, ఒక్కో టీచర్‌కు రూ.60 వేల నుంచి 80 వేల వరకు జీతాలిస్తున్నామని చెప్పారు. దీనిని తాము ఖర్చుగా భావించడం లేదని, విద్యపై పెట్టే పెట్టుబడి సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ బడి పిల్లలు- ప్రతిభ గల పిడుగులు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్కారు బడిలో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని, వందేమాతరం ఫౌండేషన్ తమ బాధ్యతను గుర్తు చేసిందని అన్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయిన తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని చెప్పారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల్లో 90% మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని వివరించారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌ను మార్చేందుకు త్వరలోనే విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా కమిషన్ విద్యావ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్య, వ్యవసాయాన్ని ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నదని, వ్యవసాయ కమిషన్‌ను సైతం త్వరలో ఏర్పాటుచేస్తామని తెలిపారు. గ్రామీణ పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయబోమని స్పష్టంచేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మహిళాసంఘాలకు అప్పగిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాశ్‌రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, కార్యదర్శి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.