Revanth Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచి జిల్లాల పర్యటన చేపట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి, ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
9వ తేదీనే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూపు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అదే రోజు జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగం చేయనున్నారు. అదే సమావేశంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. సాయంత్రం 5.30 గంటల తరువాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి.
ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న సమస్యలపై నివేదికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేదానిపై రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి.