Banakacherla Project | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం నుంచి చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రేపు 18వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అఖిలపక్ష ఎంపీలను అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతోపాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటుగా స్వయంగా ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి – బంకచర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చర్చించనున్నట్లు, అందులో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
ప్రాజెక్టు ప్రతిపాదనలను భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖలు, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు ఏపీ ఇప్పటికే సమర్పించిందని తెలిపారు. ప్రాథమిక అధ్యయనంలోఈ ప్రాజెక్ట్ 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని, ఊహించిన విధంగా ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించారు.
గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటూ, తాను ఇప్పటికే కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులకు భారత ప్రభుత్వానికి లేఖలు రాశానని వివరించారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టుపై మా అభ్యంతరాలను తెలియజేశామని తెలిపారు. ప్రస్తుతం జల్ శక్తి మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ సమీక్షలో ఉన్న గోదావరి – బనకచర్ల పథకం ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని సైతం కోరినట్లు మంత్రి తన లేఖలో వెల్లడించారు. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకుని, తదుపరి చర్యలు తీసుకోవడానికి బుధవారం సాయంత్రం 4:00 గంటలకు తెలంగాణ సచివాలయంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో జరిగే సమావేశంలో పార్లమెంటు సభ్యులందరి అభిప్రాయాలు/సూచనలను తీసుకోవాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డిలను గౌరవ అతిథిగా ఆహ్వానిస్తున్నామని, వారి విలువైన సూచనలను కోరుతున్నామని తెలిపారు.