Free Power | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తాం. ఈ అంశంపై మార్చి 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లకు సర్వీస్ పర్సన్లను నియమిస్తాం.
కావాల్సిన నిధులను ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో జమచేస్తాం’ ఇవి మార్చి 10న జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ. ఐదు మాసాలు గడిచినా ఈ హామీలను నెరవేర్చలేదు. రాష్ట్రంలో 26,826 సర్కారు బడుల్లో 20.75 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు.
గత కేసీఆర్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించింది. సర్పంచుల కాలపరిమితి ముగియడం, కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు సర్వీస్ పర్సన్లను నియమించకపోవడంతో బడుల్లో పారిశుధ్య నిర్వహణ అటకెక్కింది. మధ్యాహ్న భోజనం, ఇతర వ్యర్థాలను తొలగించేవారు లేక ఈగలు, దోమలు ముసురుతున్నాయి. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆ రెండు హామీలను వెంటనే నెరవేర్చాలని ఉపాధ్యాయలోకం కోరుతున్నది.
రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఎల్బీ స్టేడియంలో సమావేశం కానున్నారు. ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులతో సీఎం భేటీ కానుండగా ఈ సభకు 30 వేల మందికిపైగా హాజరుకానున్నారు. ఉపాధ్యాయులను తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసింది. ఒక్కో బస్సుకు ఒక నోడల్ అధికారి, అసిస్టెంట్ నోడల్ అధికారి, పోలీసు కానిస్టేబుళ్లను ఇన్చార్జులుగా నియమించింది. ఒక్కో సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులను వేదిక మీదికి ఆహ్వానిస్తారని ఇప్పటికే సంఘాలకు సమాచారం ఇచ్చారు. సర్వీస్ పర్సన్లు, ఉచిత విద్యుత్తు సహా పెండింగ్‌లో ఉన్న హామీలను ఇదే సభలో ప్రస్తావించాలని వివిధ సంఘాల నేతలు యోచిస్తున్నాయి. అపరిష్కృత సమస్యలను, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ సభలో ప్రస్తావించాలని మరికొన్ని సంఘాల నేతలు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో సభకు వచ్చే ఆ ఉపాధ్యాయులకు వివిధ జిల్లాల డీఈవోలు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. బస్సు ఎక్కాక, సభ ముగిసిన తర్వాతా సెల్ఫీ తీసుకోవాలని, సీఎల్ మంజూరు చేయబోమని, స్కూల్ రిజిస్టర్లో సంతకం పెట్టరాదని, సొంత వాహనాల్లో రావొద్దని ఆదేశించారు. ఇదే అంశంపై ఆరా తీసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా తామెలాంటి నిబంధనలు విధించలేదని, ఒకరిద్దరు డీఈవోలు ఇలాంటి ఆదేశాలిచ్చినట్టుగా తమ దృష్టికి వచ్చిందని వివరణ ఇచ్చారు. బస్ ట్రాకింగ్ యాప్‌ను మాత్రమే వినియోగిస్తున్నామని, బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే పోలీసులతో సమన్వయం చేసుకునేందుకు వినియోగిస్తున్నామని తెలిపారు.