CM Revanth Reddy | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూన్ 4వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై పార్టీ హైకమాండ్‌తో కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలుసార్లు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ భేటీ అయి.. తెలంగాణ అంశాలపై హైకమాండ్ కీలకంగా చర్చించినట్లు సమాచారం.
వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం హస్తినకు వెళ్లాల్సి ఉండే. కానీ హైకమాండ్ అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడినట్లు నిన్న గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో మంత్రి వర్గ విస్తరణ, టీ పీసీసీ పోస్టుల భర్తీ ఆశావహులకు ఆడియాశలు ఎదురయ్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.
గత ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు. కానీ వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ నిరాశతో హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. అయితే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ మళ్లీ ఆదేశించింది. సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లలేదని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలిసింది.