హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మిక సంఘాలు మంగళవారం యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సినీ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి రూ.10 కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. సినీ కార్మికులు ప్రాక్టీస్ చేసుకునేందుకు ఫ్యూచర్ సిటీలో కొంత స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు.
పెద్ద సినిమాల టికెట్ ధరలు పెంచినప్పుడు అందులోంచి 20 శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి కేటాయించాలని సూచించారు. అలా ఇస్తేనే టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. పెద్ద సినిమాలకు వచ్చే ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. సినీ కార్మికులు సంతోషంగా ఉంటేనే నిర్మాతలు, హీరోలు ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు. కార్మికుల పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకోసం పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. నవంబర్‌లో మరోసారి సినీ కార్మికులు, సినీ పెద్దలతో సమావేశం అవుతామని తెలిపారు. వారి కోసం చేపట్టే కార్యక్రమాల వివరాలను డిసెంబర్ 9న ప్రకటిస్తామని వెల్లడించారు.