మానకొండూర్, ఫిబ్రవరి 26 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎన్నికలప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తున్నదని, ఓట్లు దండుకునేందుకే డ్రామా ఆడుతున్నారని, మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఎకరానికి 15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని ఆశపెట్టి, రెండేళ్లలో రెండు సీజన్లకు ఎగనామం పెట్టి రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. మానకొండూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామంటూ అబద్ధపు హామీలతో రేవంత్‌రెడ్డి గద్దెనెక్కాడని ధ్వజమెత్తారు.
ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పెట్టుబడి సాయం అందించకుండా, పండించిన ధాన్యం కొనకుండా, బోనస్ ఇవ్వకుండా అన్నదాత ఉసురు తీస్తున్నదని మండిపడ్డారు. ప్రతీసారి ఎన్నికల ముందు రైతు భరోసా డ్రామా ఆడుతున్నారని, ఎన్నికలవగానే వేస్తామని చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయి ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు జమచేయడం లేదని ప్రశ్నించారు. క్యాబినేట్ సమావేశంలో రైతుభరోసా, యూరియా కష్టాలపై ఉలుకు పలుకూ లేదన్నారు. కానీ, అన్నదాతల నోట్లో మట్టి కొట్టి గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇస్తామని తీర్మానం చేయడం సిగ్గుచేటన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. మానకొండూర్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల అక్రమాలు మితిమీరుతున్నా ఎమ్మెల్యే కవ్వంపల్లి పట్టించుకోక పోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆయన అనుచరులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇల్లంతకుంట మండలంలో ఒకరి పేరు మీద వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను డ్రా చేసుకున్నారని గుర్తు చేశారు.
ఇటీవల శంకరపట్నం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బసవయ్య సమీప బంధువు గద్దపాక మహిళా సంఘాల సీఏ లక్ష్మి వేరే ఆమె పేరు మీద వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కును దుర్వినియోగం చేశారని, బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే బాధితుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, పిట్టల మధు, గుర్రం కిరణ్‌గౌడ్, వెన్న అనిల్, రాచకట్ల వెంకటస్వామి, ఎనగందుల సుదర్శన్, బోడ రాజశేఖర్, రహమత్ అలీ, ఇస్కుల్ల అంజయ్య, గడ్డం సంపత్, పిండి సందీప్ తదితరులు పాల్గొన్నారు.