హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికుల కోసం కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం పోరాటానికి దిగింది. ఈ క్రమంలో మార్చి 24న ‘చలో ఇందిరాపార్క్’కు పిలుపునిచ్చినట్టు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఐఎన్టీయూసీ) తెలిపింది. తమ డిమాండ్ల సాధనకు మార్చి 26 నుంచి మూడ్రోజులపాటు సామూహిక నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటిచింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మీ బాకీ సుమారు రూ.4,700 కోట్లు ఇవ్వాలని, సబ్సిడీ డబ్బులు సుమారు రూ.405 కోట్లు, వివిధ బకాయిలను చెల్లించడానికి బడ్జెట్లో వన్‌టైం మెజర్ కింద రూ.5 వేల కోట్ల గ్రాంట్ కేటాయించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు దాటినా ఇప్పటి వరకు విలీన ప్రక్రియ పూర్తిచేయలేదని, అపాయింటెడ్ డే ప్రకటించలేదని, యూనియన్ల పునరుద్ధరణ జరుగలేదని ఆ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాహార దీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్ల నుంచి కార్మికులు వేలాదిగా తరలిరావాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి పిలుపునిచ్చారు.