గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల నాలుగో రోజు భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల మోత మోగించారు. ఈ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణంపై గురిపెట్టిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి పసిడితో టోర్నీలో తన ఆధిపత్యాన్ని ఘనంగా చాటిచెప్పగా మణిపూర్‌కే చెందిన యువ క్రీడాకారుడు రిషికంఠ సింగ్ రజతంతో మెరిశాడు. సీడబ్ల్యూజీలో పాత రికార్డుల దుమ్ము దులుపుతూ పతకాల బరువులెత్తిన ఈ ఇద్దరు మణిపూర్ క్రీడాకారులు దేశానికి ఒకేరోజు రెండు మెడల్స్ అందించడంతో పతకాల పట్టికలో భారత్.. మొత్తంగా 3 పతకాలతో 7వ స్థానం లో నిలిచింది. మిగిలిన క్రీడల విషయానికొస్తే లాన్‌బౌల్స్, జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురవగా వ్యక్తిగతంగా విఫలమైన స్విమ్మ ర్లు.. మరోసారి పతక రేసులోకి వచ్చారు.
రిషికంఠకు రజతం
పురుషుల 60 కి. విభాగంలో యువ వెయిట్‌లిఫ్టర్ రిషికంఠ రజతంతో మెరిశాడు. ఈ మణిపూర్ లిఫ్టర్ మొత్తం 264 కిలోల బరువులెత్తి రెండో స్థానంతో తన కామన్వెల్త్ కెరీర్లో పతక బోణీ చేశాడు. స్నాచ్‌లో రికార్డు స్థాయిలో 121 కి. ఎత్తిన అతడు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 143 కి. ఎత్తాడు. స్నాచ్‌లో రాణించినప్పటికీ క్లీన్ అండ్ జెర్క్‌లో 151 కి. ఎత్తే క్రమంలో అతడు చివరి రెండు ప్రయత్నాల్లో విఫలమై సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. మలేషియాకు చెందిన మహ్మద్ అనిక్ కాడ్సాన్ 273 కిలోలు (121+152) స్వర్ణం నెగ్గగా కెన్యా క్రీడాకారుడు జోషువా అముంగ 244 కి. (109+135)తో కాంస్యం సాధించాడు. గత ఎడిషన్‌లో 55 కి. విభాగంలో బరిలోకిదిగి పతకం కొట్టకుండానే వెనుదిరిగన రిషికంఠ.. ఈసారి తన కలను నెరవేర్చుకున్నాడు.
స్విమ్మర్లు ఫైనల్‌కు..
వ్యక్తిగత విభాగాల్లో పతకానికి చేరువగా వచ్చి విఫలమైన స్విమ్మర్లు కలిసికట్టుగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల 4X200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే పోటీల్లో శ్రీహరి, నెహ్రా, అనీశ్, శశికుమార్‌తో కూడిన బృందం.. 7:39.48 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తిచేసి ఆస్ట్రేలియా (7:08. 66), ఇంగ్లండ్ (7:18.33) తర్వాతి స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
లాన్‌బౌల్స్, జిమ్నాస్టిక్స్‌లో నిరాశ..
లాన్‌బౌల్స్‌లో భాగంగా మెన్స్ సింగిల్స్ సెలక్షన్ ప్లేలో పుతుల్ సోనోవాల్.. 0.5-1.5తో పర్నిస్ (మాల్టా) చేతిలో ఓడటంతో అతడి పతక ఆశలు అడియాసలయ్యాయి. విమెన్స్ పెయిర్స్ సెలక్షన్ ప్లేలో రూపా రాణి, పింకీ సింగ్‌తో కూడిన భారత్.. 0-3తో నమీబియా చేతిలో ఓడింది. మరో పోరులో భారత్ 0-1తో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. జిమ్నాస్టిక్స్‌లో తపన్ మొహంతి 15వ స్థానంతో ముగించాడు.
చాను హ్యాట్రిక్
మహిళల 49 కిలోల విభాగంలో మీరాబాయి.. 190 కేజీలు ఎత్తి తన కామన్వెల్త్ పతకాల ఖాతాలో మరో మెడల్‌ను చేర్చుకుంది. స్నాచ్‌లో 85 కేజీలు ఎత్తిన చాను.. క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కి. తో అదరగొట్టింది. స్నాచ్ తొలి ప్రయత్నంలో 82కి. ఎత్తడంలో విఫలమైన ఆమె.. తర్వాత 82 కి., 85 కి. ఎత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లోనూ మొదటిసారి 105 కి. ఎత్తేందుకు తడబడ్డ ఈ మణిపూర్ అమ్మాయి.. రెండోసారి అదే బరువును అవలీలగా ఎత్తేసింది. తన ప్రత్యర్థులెవరూ 94 కి. బరువునూ క్రాస్ చేయలేకపోయేసరికి ఆమె మూడో ప్రయత్నానికి రావాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ పోటీలో నైజీరియాకు చెందిన రత్ అసుకో న్యొంగ్ (168 కి.) సిల్వర్ మెడల్ గెలుచుకోగా ఇరెన్ జేన్ హెన్రీ (167 కి.) కాంస్యం సాధించింది. అసుకోకు చానుకు తేడా ఏకంగా 22 కి.లు ఉందం టే భారత అమ్మాయి జోరు ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాఉండగా 190 కి. బరువులెత్తిన ఆమె 48కి. విభాగంలో కొత్త రికార్డును నమోదుచేసింది. కాగా ఈ క్రీడల్లో హ్యాట్రిక్ గోల్డ్ సాధించిన మీరాకు ఇది ఓవరాల్‌గా నాలుగో పతకం. 2018 (గోల్డ్‌కోస్ట్), 2022 (బర్మింగ్హమ్), 2026 (గ్లాస్గో)లో స్వర్ణాలు నెగ్గిన ఆమె గ్లాస్గోలోనే జరిగిన 2014 పోటీల్లో రజతం సాధించింది.
బస్తాలు మోసిన చేతులే..
పూట గడవడానికి ఒకప్పుడు రోజుకు రూ. 150కు వెళ్లిన ఆ కుర్రాడు.. గ్లాస్గోలో పతకం సాధించి దేశానికి గర్వకారణమయ్యాడు. స్థానికంగా భవన నిర్మాణ రంగంలో దినసరి కూలీగా చేస్తూ ఇసుక, ఇటుక, సిమెంట్ బస్తాలు మోసిన చేతులే ఇప్పుడు ప్రతిష్టాత్మక సీడబ్ల్యూజీలో భారత్‌కు రజత పతకాన్ని అందించాయి. దేశానికి దిగ్గజ వెయిట్లిఫ్టర్లను అందించిన మణిపూర్‌కే చెందిన అతడు.. 1998లో పశ్చిమ ఇంపాల్‌కు సమీపంలో ఉన్న ఓ కుగ్రామంలో జన్మించాడు. తన రాష్ర్టానికే చెందిన కుంజారాణి దేవి, మీరాబాయి, సంజితా చాను మాదిరిగా అతడూ ఈ క్రీడనే కెరీర్‌గా ఎంచుకున్నాడు. తన మిత్రుల్లో ఎక్కువమంది వెయిట్‌లిఫ్టర్లే ఉండటమూ రిషికంఠను ఆకర్షించింది. ఇంపాల్‌లో ప్రముఖ క్రీడాకారులు శిక్షణ తీసుకున్న ఖుమన్ లంపాక్లో గల నేషనల్ స్పోర్ట్స్ అకాడమీలోనే ట్రైన్ అయ్యాడు. 2016లో జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్ గెలిచిన అతడు.. భారత ఆర్మీలో చేరాక మరింత రాటుదేలాడు. ఆ తర్వాత అతడి కార్యక్షేత్రం ఇంపాల్ నుంచి పూణె, పటియాలాకు మారింది. 2019లో కామన్వెల్త్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచి సత్తాచాటిన అతడు.. నిరుడు అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో 271 కిలోలు ఎత్తి జాతీయ రికార్డును నెలకొల్పడమే గాక గ్లాస్గో పోటీలకు నేరుగా అర్హత సాధించాడు.
క్వార్టర్స్‌కు ప్రీతి
బాక్సింగ్‌లో మహిళల 54 కిలోల పోరులో ప్రీతి పవార్ తన పంచ్ పవర్‌తో అదరగొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రీతి.. రిఫరీ స్టాప్ కాంటెస్ట్‌తో తన ప్రత్యర్థి దెబ్రూ హాన్జె (మాలావి)ని ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. తొలి రౌండ్లో కాస్త తడబడినా రెండో రౌండ్లో ప్రత్యర్థిపై విరుచుకుపడటంతో స్కోరు 10-9తో ఆమెకు అనుకూలంగానే వచ్చింది.