Congress | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున లాబీయింగ్‌లు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి కూడా కీలకం కానున్నది. దీంతో అధిష్ఠానం పెద్దలను ప్రసన్నం చేసుకుని, ఈ పదవిని దక్కించుకునేందుకు ముఖ్యనేతలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు ఇప్పటికే జోరందుకున్నట్టు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం గాంధీభవన్‌లో చేసిన వ్యాఖ్యలతో రూఢీ అయ్యింది. పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు ఎస్సీ, బీసీ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయనకు సన్నిహితులైన, ఆయనను ఒప్పించగలిగిన నాయకుల దగ్గర లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తాజా సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల తరువాత టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్టు ఇప్పటికే అధిష్ఠానం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేసులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఖమ్మం ఎంపీ టికెట్‌ను తన సతీమణికి ఇప్పించుకునేందుకు చివరి దాకా ప్రయత్నించి భంగపడటంతో కనీసం పీసీసీ అధ్యక్ష పదవి అయినా తనకు ఇవ్వాలని భట్టి డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. పాత తరం కాంగ్రెస్ నేతలు కూడా భట్టికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిసింది. అధిష్ఠానాన్ని ప్రభావితం చేయగలిగిన నేతలతో భట్టి లాబీయింగ్ చేస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు భట్టి విక్రమార్క, మరో సీనియర్ నేత, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యి ఇదే అంశంపై చర్చించినట్టు తెలిసింది. కర్ణాటకలో పీసీసీ అధ్యక్ష పదవిలో అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొనసాగుతుండటంతో అదే తరహాలో తనకు కూడా ఇవ్వాలని భట్టి కోరుతున్నట్టు సమాచారం.
ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రిగా అగ్రకుల (రెడ్డి) సామాజిక వర్గం, డిప్యూటీ సీఎంగా, స్పీకర్‌గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన (భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్‌కుమార్) వ్యక్తులు ఉండటంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం సముచితంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీగౌడ్ కూడా పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నప్పటికీ, తనకు నమ్మకమైన వ్యక్తిగా మహేశ్‌కుమార్‌గౌడ్ వైపు రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. తనకు సీఎం మద్దతు ఉండటంతో కచ్చితంగా కాబోయే పీసీసీ అధినేత తానేనని మహేశ్‌కుమార్‌గౌడ్ ధీమాగా ఉన్నట్టు తెలిసింది. కాగా పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉండి, పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన తనకు సీఎం పదవి దక్కలేదని, తన భార్యకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని, కనీసం తనకు పీసీసీ అధ్యక్ష పదవైనా ఇవ్వాలని భట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది.
రాహుల్‌గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే ఆయన వెంటే ఉంటూ రాయబరేలి ప్రచారానికి భట్టి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఇటీవల బెంగళూరులో సమావేశమైన సందర్భంగా కూడా తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని భట్టి కోరినట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ అంశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే భట్టికి హామీ ఇచ్చినట్టు ఈ వర్గాల సమాచారం. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా భట్టి విక్రమార్క వైపు మొగ్గు చూపుతుండటంతో తనకు నమ్మకమైన వ్యక్తికి దక్కించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏవిధంగా పావులు కదుపుతారో వేచి చూడాలి.