హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 48వ సారి ఢిల్లీకి వెళ్లారు. బనకచర్లపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీని ఖరారు చేసింది. తెలంగాణ, ఏపీ సీఎంలు తమ డెలిగేషన్స్తో పాటు ఎజెండాతో రావాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించింది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి ఢిల్లీ వెళ్లారు. భేటీలో కృష్ణా జలాల వివాదంపై చర్చ జరగనున్నట్టు సమాచారం. రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారని, భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులను, అనుమతి లభిస్తే కాం గ్రెస్ పార్టీ నేతలను కలిసే అవకాశం ఉన్నదని సీఎంవో వర్గాలు తెలిపాయి.