హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC Tunnel) సొరంగంలో ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. సహాయక చర్యలను పరిశీలిస్తారు. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొట్టకూటి కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన ఎనిమిది మంది అభాగ్యుల కుటుంబాల్లో ఈ దుర్ఘటన చిచ్చు పెట్టింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను గాలికొదిలేసిన రేవంత్.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పదించి ఉంటే ఎనిమిది మంది ప్రాణాలు దక్కేవన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్ సహాయక చర్యలను పట్టించుకోకుండా తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శ్రమిస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం ప్రమాద స్థలికి వెళ్లనున్నారు. అయితే సీఎం రేవంత్ ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అయితే ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా వనపర్తికి సమీపంలోనే ఉండటం, అక్కడిదాకా వెళ్లి టన్నెల్ వద్దకు పోకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న తప్పనిసరి పరిస్థితుల్లోనే షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తున్నది.