హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ): వానకాలం రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 1.49 కోట్ల ఎకరాలకు సంబంధించి 70.11 లక్షల మంది రైతులకు రైతుభరోసా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. సోమవారం
వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి సీఎం రైతుభరోసాను, 1,034 రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా రైతులు అండగా ఉంటేనే కుర్చీ బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇవ్వడం కష్టంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కష్టాలను అధిగమించేందుకు రోజుకు 18 గంటల పాటు పని చేస్తున్నట్టు వివరించారు.
సరిదిద్దుకునేందుకు కొంత కాలమైనా సమయం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఎవరొచ్చినా తాను కలుస్తున్నానని, మంత్రులు, ఎమ్మెలేలూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారని తెలిపారు. ఏడాదిన్నరలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు. బకాయిలు విడుదల చేయాలంటూ మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారని, కానీ తాము అధికారంలోకి వచ్చే నాటికే వారి పదవీకాలం ముగిసిందని చెప్తూ, ఆ బకాయిలతో తమకు సంబంధం లేదన్నట్టు సీఎం మాట్లాడారు. లాభసాటి పంటల సాగు, వ్యవసాయ బావులకు సోలార్ విద్యుత్తు కనెక్షన్లపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఇతర రాష్ర్టాలు రేవంత్ పాలనను కోరుకుంటున్నాయి: తుమ్మల
తాను చేసే ప్రతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అందుకే చుట్టు పక్కల రాష్ర్టాలన్నీ తెలంగాణ వంటి పరిపాలన కావాలని, సీఎం రేవంత్‌రెడ్డి వంటి పాలన కావాలని కోరుకుంటున్నాయని తెలిపారు. మన పథకాలను చూసి పక్క రాష్ర్టాలు అమలు చేసే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని, ప్రజా సేవకులుగా ఉంటామని చెప్పారు. మంత్రివర్గానికి స్వేచ్ఛ, మంత్రుల అభిప్రాయాలకు విలువనిచ్చే సీఎం రేవంత్‌రెడ్డి అని ప్రశంసించారు. అందరం కలిసి రేవంత్‌రెడ్డిని మంచి సీఎంగా నిలబెట్టాలని కోరారు.
2 ఎకరాల రైతులకు నిధులు జమ
రైతుభరోసా పంపిణీ తొలి రోజులో భాగంగా సోమవారం రెండెకరాల రైతులకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నిధులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. మొత్తం 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గానూ 2,349.83 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. మిగిలిన రైతులకు 9 రోజుల్లో నిధులు జమచేస్తామని తెలిపారు.