హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలి దశలో దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్‌లో లోపాలు లేకుండా చూడాలని కోరారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐడీడీఏల పరిధిలో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు గదులను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అవకాశం కల్పించాలని సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్, ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.