హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 24వ సారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో అన్ని రాష్ర్టాల సీఎంలతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నది. పేరుకు కేంద్ర హోం శాఖ సమావేశమని, కానీ మంత్రివర్గ విస్తరణపై చర్చించడమే సీఎం ఢిల్లీ పర్యటన ప్రధాన ఎజెండా అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ అంశం ఈసారైనా కొలిక్కివస్తుందో? లేదో?నని సందేహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా ఇప్పటి వరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడంపై పార్టీలో అసంతృప్తి తారస్థాయికి చేరినట్టు తెలిసింది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు అధిష్ఠానం తీరుపై గుర్రుగా ఉన్నారు. సీఎం రేవంత్ మొన్నటి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగ్గా.. హర్యానా ఎన్నికల తర్వాత చూద్దామంటూ అధిష్ఠానం చెప్పినట్టు తెలిసింది. దసరా, హర్యానా ఎన్నికల తర్వాత చర్చిద్దామంటూ పెద్దలు చెప్పడంతో సీఎం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. దసరా కానుకగా మంత్రివర్గ విస్తరణ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో మంత్రి పదవుల ఆశావాహులు, వారిని బలపరుస్తున్న పలువురు మంత్రులు సైతం ఢిల్లీ బాట పట్టినట్టు తెలిసింది.