హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ‘ఈ సంవత్సరం సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. అదనంగా లక్ష మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పిం చాం- ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో చెప్పిన మాట. కానీ, ఆయన పర్యవేక్షణలోని రాష్ట్ర విద్యా శాఖ సమర్పించిన గణాంకాల ఆధారం గా కేంద్రం విడుదల చేసిన నివేదిక అందుకు విరుద్ధంగా ఉన్నది. మధ్యాహ్న భోజనం పథకం ప్రాజెక్ట్ అప్రూవల్బోర్డు తాజా నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో అప్పర్ ప్రైమరీ స్థాయి వరకు విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఏడాది వ్యవధిలోనే 1.25 లక్షలు తగ్గిపోయింది.
2024-25 విద్యా సంవత్సరంలో అప్పర్ ప్రైమరీ వరకు 15,75,209 విద్యార్థులు ఉండగా, 2025-26 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 14,49,608కి పడిపోయింది. ప్రాథమిక తరగతుల్లో 74 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 73వేల ఎన్రోల్మెంట్ తగ్గింది. కొత్తగా ప్రవేశపెట్టిన బాలవాటికల్లో మాత్రం 21వేల మంది చేరారు. సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ సమర్పించిన లెక్కలనే కేంద్రం ఈ నివేదిక రూపంలో విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ఏ గణాంకాలు సమర్పిస్తే వాటినే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. అంటే సర్కార్ స్కూళ్లలో 1.25 లక్షల మంది విద్యార్థులు తగ్గారని సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖే ఒప్పకొన్నట్టయ్యింది. పరిస్థితి ఇలా ఉంటే రేవంత్రెడ్డి మాత్రం లక్ష మంది పెరిగారని చెప్తున్నారు.
సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ విషయంలో గతంలో ఒకసారి సీఎం రేవంత్రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారు. 2025 గురుపూజోత్సవంలో పాల్గొన్న సీఎం.. ఈ ఏడాది 3 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కార్ బడుల్లో చేరారని చెప్పారు. కానీ, 2025-26 విద్యా సంవత్సరంలో మొత్తం ఎన్రోల్మెంటే మూడు లక్షలు దాటలేదు. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూళ్ల నుంచి మూడు లక్షల మంది సర్కార్ బడుల్లో ఎలా చేరుతారన్నది మిలియన్ డాలర ప్రశ్న. ఏడాది వ్యవధిలోనే ఆయన రెండు రకాల లెక్కలు చెప్పారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కార్ బడుల్లో మూడు లక్షల మంది చేరారని ఒకసారి చెప్పగా, తాజాగా ఎన్రోల్మెంట్ లక్ష పెరిగిందని చెప్పారు. మరోవైపు, మధ్యాహ్న భోజన పథకం నివేదిక మాత్రం 1.25 లక్షల ఎన్రోల్మెంట్ తగ్గినట్టు చెప్తున్నది.
