ఉప్పల్, ఆగస్టు 12 : తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీలు ప్రకటించక పోవడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి లక్ష్మారెడ్డి వినతిపత్రం అందజేశారు.
జూలై 29న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర పోలీస్ శాఖలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆ మూడు జిల్లాల్లో ఖాళీలు ప్రకటించలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఉన్నారని, పోలీస్ ఉద్యోగాల కోసం వారు కొంతకాలంగా సన్నద్ధం అవుతున్నారని తెలిపారు.
ఈ విషయమై మంత్రి శ్రీధర్‌బాబు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్రావు, నేమూరి మహేష్‌గౌడ్, జెట్ట కిశోర్, ధర్మారెడ్డి, శ్రావణ్ పాల్గొన్నారు.