సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పార్కు చుట్టూ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫె్లైఓవర్ల ప్రాజెక్టుకు భూ సేకరణ గండం వెంటాడుతూనే ఉంది.. వీవీఐపీలు, వీఐపీలు ఉండే కీలకమైన ఈ ప్రాంతంలో భూ సేకరణ కష్టసాధ్యమని అధికారులకు తెలిసినా.. కనీసం భూ సేకరణ 30 శాతం సేకరించకుండానే ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది.దాదాపు రెండేళ్లుగా భూ సేకరణ పట్టుమని 20 శాతం కూడా పూర్తి చేసుకోకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
రహదారుల వెడల్పు, ఫె్లైఓవర్ల నిర్మాణాల కోసం భూములు సేకరించే క్రమంలో జీహెచ్ఎంసీ ఇచ్చే ట్రాన్స్ ఫరబుల్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్లను స్వీకరించేందుకు భూ యజమానులు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లో గజం ధర లక్షల్లో పలుకుతోంది. ఈ ప్రాంతాల్లో టీడీఆర్ పత్రాలతో ప్రయోజనం లేదని భూ బాధితులు తెగేసి చెబుతున్నారు.
నగదు పరిహారమే కావాలని, లేకపోతే భూములను ఇచ్చేది లేదని పట్టుబడుతుండటంతో ఖర్చు భరించలేక అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. విచిత్రమేమిటంటే కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో డెవలపర్లు, స్థల యజమానులు టీడీఆర్‌లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు అవసరమైన చోట మిగతా భూములు రాక, మరోవైపు ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో విధానపరమైన ఆలస్యంతో టీడీఆర్ వ్యవస్థే అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో భూ యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు..కనీసం యంత్రాంగం ప్రాజెక్టు పురోగతి, భూ సేకరణపై సమీక్షలు జరపకపోవడం గమనార్హం.
కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ నివారణ కోసం ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్‌లను నిర్మించేందుకు సరారు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడం, భూ సేకరణపై స్పష్టత లేకుండా ఆగమేఘాల మీద టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం, యుటిలిటీల బదలాయింపునకు కలుపుకుని మొత్తం వ్యయం రూ, 1090 కోట్లు కాగా, ఒక కేబీఆర్ పారు చుట్టూ ఆరు జంక్షన్ల వద్ద చేయాల్సిన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాంతాలైన విరంచి హాస్పిటల్, ఎన్ఎఫీ సీ, టీవీ 9 జంక్షన్లతో కలుపుకుని కేవలం స్థల సేకరణకు రూ. 1543.82 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ తరుణంలోనే ప్రాజెక్టు పురోగతిలో ఉందని చూపించేందుకు అధికారులు వివాదాలు లేని ఒకటి రెండు జంక్షన్లలో పనులు మొదలుపెట్టి హడావుడి చేస్తున్నారు. కానీ, ఆరు జంక్షన్ల వద్ద భూసేకరణ ప్రక్రియ ఎకడ వేసిన గొంగళి అకడే అన్న చందంగా మారింది. మారింగ్ పూర్తయినా, కోర్టు స్టే వల్ల ప్రాజెక్టు ఇతర చోట్ల ముందుకు కదలడం లేదు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
పరిహారం చెల్లింపులో వ్యత్యాసాలు, బలవంతపు సేకరణ ప్రతిపాదనలతో బాధితులు కోర్టుకెక్కారు.పర్యావరణ పరిరక్షణ, చెట్ల నరికివేత, స్థల సేకరణపై పౌరులు, పర్యావరణవేత్తలు దాఖలు చేసిన పిటిషన్లతో రోజురోజుకూ న్యాయపరమైన చికులు ముదురుతున్నాయి. కోర్టులు స్టే విధిస్తుండటంతో క్షేత్రస్థాయిలో యంత్రాలు పనిచేయకుండా నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది.
