హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో 73,39,234 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు ‘అన్ కలెక్టబుల్’గా నమోదైన అంశంపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘అన్ కలెక్టబుల్’ క్యాటగిరీలో పెట్టిన ఓటర్ల వివరాలు వెల్లడించాలని కోరింది. ఈ సంఖ్య మొత్తం ఓటర్లలో 21.70 శాతం కావడంతో దీనిపై పూర్తి పారదర్శకత, స్వతంత్ర పరిశీలన అవసరమని పేర్కొన్నది. తాతాలికంగా వలస వెళ్లిన వారిని కూడా శాశ్వతంగా మారినవారిగా పరిగణించవద్దని కోరింది. డిలీషన్‌కు ముందు పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ‘సర్’ టీమ్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, 2,64,87,214 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయని, 73,39,234 ఫారాలు సేకరించలేకపోయినవిగా చూపించారని బీఆర్ఎస్ తన వినతిపత్రంలో పేరొన్నది. ఇందు లో 9,22,230 మంది మరణించినవారు, 11,25,546 మంది గైర్హాజరు/ఆచూకీ లేనివారు, 45,18,961 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు, 6,70,203 మంది ఇప్పటికే నమోదైనవారు, మరో 1,02,294 మంది ‘ఇతరులు’ ఉన్నట్టుగా తెలిపారని గుర్తుచేసింది. ఈ 73.39 లక్షల మంది పేర్లు కేవలం ఫారం సేకరించలేకపోయిన కారణంగానే తొలగిస్తారా? లేక డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో కొనసాగిస్తారా? అనే దానిపై ఈసీ స్పష్టత ఇవ్వాలని కోరింది.
‘పర్మనెంట్లీ షిఫ్టెడ్’గా పేరొన్న 45,18,961 మంది విషయంలో ప్రత్యేక పరిశీలన అవసరమని బీఆర్ఎస్ కోరింది. ఇంటింటి ధ్రువీకరణ నివేదికలు, బీఎల్వోల నివేదికలు, పొరుగువారి ధ్రువీకరణ, మున్సిపల్ లేదా ఆస్తి రికార్డులు, పోస్టల్ సమాచారం తదితర ఏ ఆధారాల ఆధారంగా వారిని శాశ్వతంగా వలస వెళ్లినవారిగా గుర్తించారో వెల్లడించాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్, పోలింగ్ స్టేషన్, బీఎల్వో, జిల్లావారీగా వివరాలను అందుబాటులో ఉంచాలని కోరింది.
ఉద్యోగాల కోసం తాతాలికంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, అద్దె ఇండ్లల్లో నివసించేవారు, హాస్టళ్లలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నవారు, ఇంటికి తాళం వేసి తాతాలికంగా వెళ్లిన కుటుంబాలు వంటి వారిని కేవలం ఎన్యుమరేషన్ సమయంలో అందుబాటులో లేకపోయారనే కారణంతో శాశ్వతంగా వలస వెళ్లినవారిగా పరిగణించరాదని కోరింది. ఓటర్లను తొలగించే ముందు చట్టబద్ధమైన విధానాలను, ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 22ను పాటించాలని బీఆర్ఎస్ సూచించింది.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో కుటుంబసభ్యుల ధ్రువీకరణ పత్రాల(ఎఫ్ఆర్సీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. 2026 జూలై 25 తర్వాత జారీచేసిన ఎఫ్ఆర్సీలను సర్ వెరిఫికేషన్‌లో నిర్దేశిత పత్రాల్లో ఒకటిగా స్వీకరించబోమని ఈసీ తేల్చిచెప్పింది.