హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : యూరియా కొరతపై రైతుల నిరసనలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ‘స్థానిక’ పాచిక వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్పిన తర్వాత 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటమార్చారు. ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ కోటాతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ప్రభుత్వ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని తెలిసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. సద్దుల బతుకమ్మకు రెండు రోజుల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని, దసరాకు ఒక రోజు ముందుగానో లేక, మరుసటిరోజునో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ మేరకు శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఇంటెలిజెన్స్ చీఫ్‌తోనూ చాలా సేపు మంతనాలు జరిపినట్టు తెలిసింది. యూరియా కొరతపై రైతుల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే సీఎం మరోసారి బీసీ అస్ర్తాన్ని ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. న్యాయ సమీక్ష ముందు నిలబడని ఉత్తర్వులిచ్చి స్థానిక ఎన్నికల డ్రామాకు తెరలేపారని చెప్తున్నారు.
రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రపతి నిర్ణయాధికాన్ని సుప్రీం కోర్టు నిర్ణయించగలదా? అనే అంశం మీద సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున తెలంగాణలో స్థానిక సంస్థల నిర్వహణ సాధ్యం కాదని, కోర్టుకు వెళ్లి గడువు కోరుతామని శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి కలిసిన వెంటనే తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఇంటెలిజెన్స్ డీజీ సర్కారుపై రైతు, మహిళా వ్యతిరేకత గురించి వివరించినట్టు సమాచారం.
ఎంగిల పూల బతకమ్మ పండుగ నుంచి మొదలుపెట్టి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు మహిళలు ప్రభుత్వం మీద నిరసన పాటలతో బతుకమ్మ ఆడేందకు సిద్ధమయ్యారని, గణేశ్ నిమజ్జం రోజున ట్యాంక్‌బండ్ మీద యువత కేసీఆర్ డీజే పాటలను మించి ప్రజలు ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గొంతు విప్పబోతున్నారని నివేదించినట్టు తెలిసింది. ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం మినహా మరో మార్గం లేదని సూచించినట్టు సమాచారం. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలను తెర మీదికి తెచ్చారన్న చర్చ నడుస్తున్నది.
శనివారం ఉన్నపళంగా అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య అధికారులతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా? వద్దా? అనే విషయంలోనే చర్చ జరిగినట్టు తెలిసింది.
రాష్ట్రపతికి, గవర్నర్‌కు పంపిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, బిల్లులు వారి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా బీసీ కోటా ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు సీఎంకు సూచించినట్టు తెలిసింది. పైగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి కోటాకు విరుద్ధమని, సాంకేతికంగా చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చే జీవో చెల్లదని, ఒక్క దఫాలోనే కోర్టు ముందు కొట్టుడు పోతుందని సూచించినట్టు సమాచారం. అయితే ఉత్తర్వులు కోర్టులో చెల్లకపోవడమనేది బీసీలు, ప్రతిపక్షాలు చూసుకుంటాయని, కోర్టు నిర్ణయానికి ముందే మనం బయపడటం ఎందుకని సీఎం అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సద్దుల బతుకమ్మకు రెండు రోజుల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేయాలని, దసరాకు ఒక రోజు ముందో లేక, మరుసటిరోజునో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని
నిర్ణయించినట్టు తెలిసింది.