హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కేరళ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, తరచూ ప్రచారానికి వెళ్లడం, ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌పై విమర్శలు చేయడంపై రాజకీయవర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీ కండ్లల్లో ఆనందం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి తహతహలాడుతున్నారని, అందులో భాగంగానే కేరళ సీఎంపై చిందులు తొక్కుతున్నారని వాదన బలంగా వినిపిస్తున్నది. దేశవ్యాప్తంగా మోదీని, బీజేపీ హవాను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంటే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వేస్తున్న అడుగులపై జాతీయస్థాయిలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది.
కేరళ, అస్సాం రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సీఎం రేవంత్‌ను ఏఐసీసీ వర్గాలు పురమాయించాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, ఆయన కేవలం కేరళ ఎన్నికల ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి, ఉద్దేశపూర్వకంగానే అస్సాంకు వెళ్లడం లేదనే వాదన వినిపిస్తున్నది. ఇందుకు బలమైన కారణం ఉందని చెప్తున్నారు. ఒకవేళ అస్సాం ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మను టార్గెట్ చేయాల్సి ఉంటుందని, అలా చేస్తే ‘బడే భాయ్’కి కోపం వస్తుందని భావించే ‘చోటేభాయ్’ ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారని అసలు కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నది. అయితే, తెలంగాణ నుంచి ఏ ఒక్కరూ వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించే మంత్రి ధనసరి అనసూయ సీతక్క లాంటి వాళ్లను అస్సాం ప్రచారానికి పంపారని చెప్పుకుంటున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం వెనుక ‘బడే భాయ్’ ఆదేశాలే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వాములైన కమ్యూనిస్టులను విమర్శించడం ద్వారా, వారిని ఆ కూటమి నుంచి ప్రత్యేకించి కాంగ్రెస్‌కు శాశ్వతంగా దూరం చేయాలనే పథక రచనలో భాగంగానే రేవంత్ కేరళకు అన్నిసార్లు ప్రత్యేకంగా వెళ్లారనే వాదన వినిపిస్తున్నది. కేరళ సీఎం పినరయి విజయన్‌పై రేవంత్ ఇష్టారీతిగా నోరుపారేసుకోవటం కూడా ‘బడే భాయ్..చోటే భాయ్’ యాక్షన్ ప్లాన్‌లో భాగం అనే చర్చ పొలిటిక ల్ సర్కిల్స్‌లో సాగుతున్నది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై 2022 నుంచి నోరు పారేసుకుంటున్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను కట్టడి చేయటానికి ఇంతకన్నా మంచి తరుణం రాదని ఏఐసీసీ నాయకత్వం భావించింది. అస్సాంలో గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని బృందం ఒకరకంగా యుద్ధమే చేస్తున్నదన్న వాతావరణాన్ని నెలకొన్నది. హిమంత బిశ్వశర్మతో నువ్వానేనా అన్నట్టు తలపడుతున్న తమకు రేవంత్‌రెడ్డి చేయూత అందిస్తారని అస్సాం కాంగ్రెస్ భావించింది. అయితే అనుకున్నదొక్కటి.. తెలంగాణ సీఎం ఆచరించిందొక్కటి అన్నట్టుగా ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌ను, రేవంత్‌రెడ్డిని పోల్చుతున్నారు.
ప్రధానంగా 2022లో చోటుచేసుకున్న పరిణామాలపై సర్వత్రా చర్చ సాగుతున్నది. జాతీయ పార్టీలు అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీల నాయకులు గల్లీనేతల కన్నా దిగజారి మాట్లాడుకుంటున్న సందర్భాన్ని, ఆ పార్టీల నేతలు పరస్పర దూషణలు వ్యక్తిగతస్థాయికి దిగజారటమే కాకుండా చివరికి ‘పుట్టుపూర్వోత్తరాల’ను సైతం రాజకీయాల్లోకి లాగటాన్ని బీఆర్ఎస్ అధినేత, నాటి సీఎం కేసీఆర్ తూర్పారబట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను కేసీఆర్ చీల్చిచెండాడారు. ఇదేనా దేశ సంస్కృతి? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. తక్షణమే హిమంతను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కోరారు. దేశవ్యాప్తంగా నాడు కేసీఆర్ వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి. ఏఐసీసీ వర్గాలు, తెలంగాణ పీసీసీ సహా మరే రాష్ట్ర పీసీసీగానీ బీజేపీ దూకుడును తట్టుకోలేక విలవిల్లాడుతున్న సందర్భంలో నాడు కేసీఆర్ రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తే.. రాజదండం చేబూనిన రేవంత్‌రెడ్డి అస్సాం వైపు కన్నెత్తి చూడకపోవటమే కాకుండా హిమంత బిశ్వశర్మపై పల్లెత్తు ప్రకటనకూడా చేయలేదని చెప్తున్నారు. అలా చేయకపోవటం వెనుక ‘భాయ్…భాయ్’ బంధమే కారణమని పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికరచర్చ జోరుగా సాగుతున్నది.
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై 2022 ఫిబ్రవరిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, నాటి సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారని, అందుకు బలమైన కారణం ఉన్నదని నాటి విషయాలను గుర్తుచేసుకుంటున్నారు. ‘సర్జికల్ దాడులు జరిగాయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే చెప్తున్నది. ఒకవేళ సర్జికల్‌దాడులు జరిగితే వాటికి సాక్ష్యాలున్నాయా? ఉంటే బయటపెట్టండి’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గతంలో కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీనికి బీజేపీ జవాబు ఇవ్వకపోవటమే కాకుండా ‘నువ్వు ఏ అయ్యకు పుట్టావని మేము అడుగుతున్నామా?’ అని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ సంధించిన రాజకీయ అంశాలను విస్మరించి వ్యక్తిగత అంశాలను హిమంత తెరపైకి తేవటం తీవ్రస్థాయిలో వివాదమైంది. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలే కాకుండా రాష్ర్టాల్లో పేరున్న నాయకులెవరూ పెద్దగా స్పందించలేదు. అయినా నాడు సీఎం హోదాలో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.
‘మోదీజీ ! ఇదేనా మన భారతీయ సంసృతి? వేదాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీతలో బోధించిన నీతి ఇదేనా? దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిర, రాజీవ్‌గాంధీ కుటుంబంపై సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిని విస్మరించి అంత నీచంగా మాట్లాడొచ్చునా? దాన్ని మీరు సమర్థిస్తున్నారా?’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఒక నాయకుడు అంతనీచంగా మాట్లాడుతుంటే బీజేపీ కేంద్రనాయకత్వం చూస్తూ ఊరుకోకుండా తక్షణమే హిమంత బిశ్వశర్మను పార్టీ నుంచి తొలగించాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. తన పార్టీ కాకపోయినా నాడు కేసీఆర్ ప్రదర్శించిన రాజనీతిజ్ఞత, నైతికత ముందు నేడు సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.