లగచర్ల ఘటనపై ఆలస్యంగానైనా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక మీడియాను ఎంత మేనేజ్ చేసినా.. ఆ రోజు అర్ధరాత్రి పోలీసు అరాచకాలు, దౌర్జన్యాలు బయటికి పొక్కకుండా రాజకీయ మందబలంతో అడ్డుకున్నా.. ఆఖరికి నిజం బయట పడింది. నిరుడు నవంబర్‌లో లగచర్ల, చుట్టుపక్కల గిరిజన తండాల్లో పోలీసుల దౌర్జన్యకాండపై జాతీయ మానవహక్కుల కమిషన్ నిజ నిర్ధారణ చేసి మరీ నివేదికను బయట పెట్టింది. రాజకీయ ప్రేరేపితంగా సాగిన రాక్షస క్రీడలో పోలీసుల అత్యుత్సాహాన్ని నగ్నంగా నిలబెట్టింది. ఈ అరాచకంపై ఆరు వారాల్లోగా తుది నివేదికను అందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
NHRC | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ‘మా భూములు మాకే’నని మర్లబడ్డ దేవీబాయి, పాత్లావత్ జ్యోతి, గోబీబాయి, హకీంపేట అనంతమ్మ, వాల్కీబాయి, రత్నిబాయి, మున్నీబాయి, సోనీబాయి వంటి ఎందరో గిరిజన బిడ్డల పోరాటంలో న్యాయం ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ గుర్తించింది. అర్ధరాత్రి తమ వారిని దొంగల్లా ఎత్తుకెళ్లిన పోలీసులు.. స్టేషన్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ.. అత్యంత దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వైనాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ తూర్పారబట్టింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగిన దారుణాలపై నివేదిక విడుదల చేయడమే కాకుండా.. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీస్ బాస్‌కు ఆదేశాలు జారీచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం 1,374 ఎకరాలను సేకరించాలని నిర్ణయించగా.. నిర్వాసిత గిరిజన, దళిత రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను అడ్డుకున్న విషయం విదితమే. అయితే, నిరుడు నవంబర్ 11వ తేదీ అర్ధరాత్రి లగచర్ల, ఆర్బీ తండా, పోలేపల్లి, పులిచెర్ల, హకీంపేట గ్రామాల్లో ప్రభుత్వ పెద్దల సహకారంతో పోలీసులు జరిపిన దౌర్జన్యకాండను నిరసిస్తూ.. బాధిత గ్రామాలకు చెందిన 12 మంది మహిళలు నిరుడు నవంబర్ 18వ తేదీన జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఫిర్యాదును కమిషన్ స్వీకరించింది.
ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు ముకేష్ (డీఆర్-లా)తో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు యతిప్రకాష్ శర్మ, రోహిత్ సింగ్‌లతో కూడిన ఇన్వెస్టిగేషన్ బృందం నిరుడు నవంబర్ 22 నుంచి 26 తేదీ వరకు బాధిత గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టింది. ఆయా గ్రామాల్లో దర్యాప్తు చేసి, బాధితులతో ఆ బృందం మాట్లాడింది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలతో పోలీసులు వారిని నిర్బంధించిన లాకప్‌లను, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వారు కస్టడీలో ఉన్న జైళ్లను సందర్శించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో క్షేత్ర దర్యాప్తు నివేదికను సిద్ధం చేసి కమిషన్ సమీక్ష కోసం పంపింది.
బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో బాధితులపై మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని జాతీయ మానవహక్కుల కమిషన్ దర్యాప్తు బృందం గుర్తించింది. వాటిలో 1) క్రైమ్ నంబర్ 153/2024 u/S 191(2)(3), 132, 109, 121(1), 126(2), 324(4) r/w 190 బీఎన్ఎస్, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ 2) క్రైమ్ నంబర్ 154/2024 u/S 191(2)(3), 132, 109, 121(1), 126(2), 324(4) r/w 190 బీఎన్ఎస్, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ 3) క్రైమ్ నంబర్ 155/2024 u/S 191(2)(3), 132, 109, 121(1), 126(2), 324(4) r/w 190 బీఎన్ఎస్, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్‌లు వంటి కఠినమైన సెక్షన్లు పెట్టారు. కాగా ఈ మూడు ఎఫ్ఐఆర్లలో మొత్తం 48 మంది గ్రామస్తుల పేర్లు పేరొన్నారు. మొత్తం 29 మంది ఆరోపితులు జైలులో ఉన్నారని, 17 మంది పరారీలో ఉన్నారని గుర్తించారు.
ఈ నమోదైన ఎఫ్ఐఆర్లపై ఆరు విభాగాలుగా సమగ్ర విచారణ చేపట్టారు. వాటిల్లో i. ఈ ఘటనలో రెండు వైపుల నుంచి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి? వాటి స్థితి ఏమిటి? ii. చట్టపరమైన ప్రక్రియ ప్రకారం భూసేకరణ జరిగిందా? బాధిత వ్యక్తులకు పరిహారం అందిందా? iii. గ్రామస్తులు బయట జీవిస్తున్నారా? లేక ప్రాథమిక సౌకర్యాలు లేకుండా అడవుల్లో దాకుని ఉన్నారా? iv. బాధితులు, ముఖ్యంగా మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయా? గాయపడిన గ్రామస్తులకు, ప్రత్యేకించి గర్భిణులకు వైద్య సహాయం అందిందారా? v. పోలీసులు, స్థానిక అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారా? vi. ప్రతిపాదిత ‘ఫార్మా ప్రాజెక్ట్’లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల హస్తం ఉందా? అనే ఆరు అంశాలపై తాము సమగ్ర విచారణ జరిపామని, సమస్య మూలాలు తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేశామని జాతీయ మానవహక్కుల కమిషన్ తెలిపింది.
ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం ఈ కింది తమ దర్యాప్తు వివరాలను కమిషన్‌కు ఉన్నది ఉన్నట్టుగా సమర్పించింది. 18.11.2024న జరుప్లా దేవి తరఫున మరో 11 మంది (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందినవారు) నుంచి ఫిర్యాదు అందుకున్నామని కమిషన్ చెప్పింది. దాని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ‘ఫార్మా విలేజ్’ కోసం బలవంతంగా భూసేకరణ చేస్తూ.. పోలీసులు వేధింపులు, శారీరక హింస, తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికించారని గుర్తించింది. బలవంతంగా సేకరిస్తున్న భూమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినదని తేల్చింది. ఆ భూమి వారు తరతరాలుగా సాగుచేస్తున్న ఫలవంతమైన వ్యవసాయ భూమి అని దర్యాప్తు బృందం గుర్తించింది. దీనికి వ్యతిరేకంగా వారు 4-5 నెలలుగా నిరసనలు చేస్తున్నారని తెలిపింది.
11.11.2024న జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో గ్రామస్తుల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత 11.11.2024 నుంచి 12.11.2024 రాత్రి వరకు పోలీసులు ఆయా గ్రామాలపై దాడి చేసి, మహిళలతో అనుచితంగా ప్రవర్తించి, నిర్దోషులైన గ్రామస్తులను అరెస్టు చేసి, తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికించారని తెలిపింది. కమిషన్ విచారణ బృందం వికారాబాద్ జిల్లా డీఎం, ఎస్పీ, ఏడీఎం, ఎస్డీపీవో, సీఐ వంటి ఇతర అధికారులను కలిసి సందర్శన ఉద్దేశాన్ని చెప్పినట్టు తెలిపింది. ఈ బృందం లగచర్ల గ్రామంతో పాటు సమీప గ్రామాలను సందర్శించి, గ్రామస్తుల ప్రకటనలను రికార్డు చేసింది. అదనంగా, బృందం సంగారెడ్డి సెంట్రల్ జైలు, హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలును సందర్శించి, అరెస్టు అయిన వ్యక్తులను కలిసి వారి ప్రకటనలను కూడా రికార్డు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి వాస్తవాన్ని బృందం లోతుగా పరిశీలించినట్టు వివరించింది.
గ్రామస్తుల అరెస్టు సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు బాధితుల ప్రకటనల ద్వారా ఎన్హెచ్ఆర్సీ బృందం గుర్తించింది. జిల్లా అధికారులు, పోలీసు విభాగం సమర్పించిన సాక్ష్యాల ప్రకారం.. జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారని దర్యాప్తు బృందం గుర్తించింది. గ్రామస్తులు వదంతులు వ్యాప్తి చేయకుండా ఇంటర్నెట్ను నిలిపివేసినట్టు తెలిపింది. గ్రామస్తులు ఆరోపించినట్టుగా విద్యుత్తు నిలిపివేత నిజం కాదని కమిషన్ తెలిపింది. అయితే అరెస్టు సమయంలో చట్టపరమైన నిబంధనలు, మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని గుర్తించింది. దీంతోపాటు పోలీసు అధికారుల తప్పిదాలు గుర్తించామని పేర్కొన్నది. అరెస్టు చేసినవారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, చిత్రహింసలకు గురైనట్టు జ్యుడిషియల్ ఆఫీసర్ ముందు చెప్పొద్దని బెదిరించినట్టు తేల్చింది.
భూసేకరణ ఆదేశం ప్రభుత్వ సంస్థల ద్వారా చట్టపరంగా జారీ అయ్యిందని.. అయితే, భూసేకరణ సమయంలో పోలీసు అధికారులు అనుసరించిన విధానం చట్టపరంగా లేదని కమిషన్ గుర్తించింది. గ్రామస్తులను రాత్రి అరెస్టు చేసిన తర్వాత నిర్బంధించిన లాకప్‌లో, సీఐ కార్యాలయంలోని సీసీ కెమెరాలు పని చేయలేదని కమిషన్ కనుగొన్నది. వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత జీడీ ఎంట్రీలు కూడా చేయలేదని తెలిపింది. ఇది పోలీసు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని సూచిస్తున్నదని తెలిపింది. పోలీసు సిబ్బంది ద్వారా గ్రామస్తులు చెప్పిన మానవ హకుల ఉల్లంఘన నిజమని గుర్తించినట్టు తెలిపింది. ఒక పబ్లిక్ సర్వెంట్ అక్రమ పద్ధతుల్లో దారుణాలను కప్పిపుచ్చేందుకు మరింత సమర్థవంతంగా ప్రయత్నించారే గానీ, వారు భూసేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించడంలో, జిల్లా అధికారులు, బాధిత గ్రామస్తుల మధ్య సహృద్భావ వాతావరణాన్ని సృష్టించడంలో విఫలమయ్యారని తెలిపింది.
ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు సమయంలో రాజకీయ కక్ష సాధింపు కోణం కూడా బయటపడిందని తెలిపింది. ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులైన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారని కమిషన్ తెలిపింది. ఈ ఘటనతో సంబంధం లేని కొంతమందిని కూడా అరెస్టు చేశారని, వారు ఇతర రాజకీయ పార్టీలను సమర్థించడం వల్లనే అరెస్టు చేశారని పేర్కొంది. మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారని తెలిపింది. వీరిలో కొందరు 11.11.2024 నాడు జిల్లా అధికారులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణ సమయంలో గ్రామంలో లేరని జాతీయ మానవహక్కుల కమిషన్ సవివరంగా తన నివేదికలో పేర్కొన్నది.
i. ఈ ఘటనలో రెండు వైపుల నుంచి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి? వాటి స్థితి ఏమిటి?
జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తులో బాధితులపై బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుర్తించారు.
ii. చట్టపరమైన ప్రక్రియ ప్రకారం భూసేకరణ జరిగిందా? బాధిత వ్యక్తులకు ఎటువంటి పరిహారం అందింది?
తెలంగాణ ప్రభుత్వం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని ప్రతిపాదించింది. ఈ సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల కుంటతండా, లగచర్ల గ్రామాల నుంచి మొత్తం 1,314.21 ఎకరాలను (ప్రభుత్వ భూమి 637.36 ఎకరాలు, పట్టా భూమి 676.25 ఎకరాలు) సేకరించాలని ప్రణాళిక వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ అభివృద్ధి ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియలో అనేక సమావేశాలు నిర్వహించారు.
iii. గ్రామస్తులు బయట జీవిస్తున్నారా? లేక ప్రాథమిక సౌకర్యాలు లేకుండా అడవుల్లో దాకుని ఉన్నారా?
గ్రామస్తులు అడవుల్లో దాకుని, ప్రాథమిక సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నట్టు గుర్తించలేదు. ఎందుకంటే పోలీసుల వద్ద పరారీలో ఉన్న ప్రతి వ్యక్తి ఆచూకీ గురించి వివరాలు ఉన్నాయి. పోలీసులు వారిని కోర్టులో లొంగిపోవాలని సందేశాలు పంపారు. ఇకడ పేరొనదగిన విషయం ఏమిటంటే, ఏ గ్రామస్తుడినీ వారు స్వస్థలం నుంచి వెళ్లగొట్టలేదు.
iv. బాధితులు, ముఖ్యంగా మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయా? గాయపడిన గ్రామస్తులకు, ప్రత్యేకించి గర్భిణులకు వైద్య సహాయం అందిందా?
కొంతమంది గ్రామస్తులు, వారి కుటుంబసభ్యులు పోలీసుల దాడికి, వేధింపులకు గురయ్యారు. సీతా రాథోడ్ అనే 22 ఏండ్ల యువతి పోలీసుల దాడి సమయంలో తన అత్తగారిని వేధించారని చెప్పారు. పోలీసు దాడిలో తన కోడలు శారీరకంగా గాయపడిందని రూప్సింగ్ అనే బాధిత మహిళ తెలిపింది. ఆమె హకీంపేటలో చికిత్స పొందిందని చెప్పారు. అందుకు సంబంధించిన రికార్డులను సమర్పించలేకపోయారు. పోలీసు దాడిలో తన ఎడమ తొడపై గాయమైందని ప్రమీలా అనే మహిళ విన్నవించగా.. ఎన్హెచ్ఆర్సీ బృందం ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించింది. ఆమె ఎడమ తొడపై 4 సెం.మీ x 5 సెం.మీ గాయం అయ్యిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు దర్యాప్తు చేయాలని ఆదేశించడమైనది.
v. పోలీసులు, స్థానిక అధికారులు అత్యుత్సాహం చూపించారా?
అందుబాటులో ఉన్న ప్రకటనలు, డాక్యుమెంట్లు, నివేదికల ఆధారంగా పోలీసులు, స్థానిక అధికారుల నుంచి కింది స్థాయి వరకు అత్యుత్సాహం ప్రదర్శించినట్టు గుర్తించారు.
a) రాత్రి సమయంలో అరెస్టు చేసిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టారు. మేజిస్ట్రేట్ ముందు చిత్రహింసల గురించి మాట్లాడవద్దని బెదిరించారు.
b) గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచారు. కానీ, ఆ విషయం జీడీ ఎంట్రీలో పేరొనలేదు.
c) చాలామంది వ్యక్తులు ఈ ఘటన స్థలంలో లేరు, ఎటువంటి నిరసనలో పాల్గొనలేదు. వారి భూమి ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రభావితం కాలేదు. అయినప్పటికీ, పోలీసులు అలాంటి వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
d) విపక్ష పార్టీలను (బీఆర్ఎస్, బీజేపీ) సమర్థించేవారిని లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని సమర్థించే వారిపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. వారిని అరెస్టు చేయలేదు.
vi. ప్రతిపాదిత ‘ఫార్మా ప్రాజెక్ట్’లో ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల హస్తం ఉందా?
మాకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ప్రభుత్వ చొరవతోనేనని అని స్పష్టమైంది.
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, ఆర్బీ తండా, పోలేపల్లి, పులిచెర్ల, హకీంపేట గ్రామాల్లో ఫార్మా కంపెనీ పెట్టడం కోసం ఆ గ్రామాల రైతుల దగ్గరి నుంచి సుమారు 1,300 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి అన్న ఎనుముల తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి రాజకీయ దురుద్దేశంతో కేవలం బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులైన రైతుల భూములను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో స్థానిక మండల తహసీల్దార్, అదనపు జిల్లా కలెక్టర్‌తో కలిసి తొమ్మిది నెలలుగా తీవ్ర ఒత్తిడి చేశారు. ఒక్కోసారి భయభ్రాంతులకు గురిచేస్తూ.. వారి భూములు లాకునే ప్రయత్నం చేశారు. అయితే, తమ భూములు కోల్పోతే జీవనోపాధి పోతుందని, దీనికి తోడు ఫార్మా కంపెనీల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడతామని గ్రహించిన ఆయా గ్రామాల రైతులు భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.
ఈ క్రమంలో వారు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే, కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇస్తూ వచ్చారు. కాగా, ఎనుముల తిరుపతిరెడ్డి (రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు) ఇంటికి బాధిత రైతులు వెళ్లి తమ గోడును విన్నవించుకుంటే.. బూట్ కాళ్లతో తన్ని, పోలీసుల చేత కొట్టించి, ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సిందేనని భయపెట్టారు. ఈ క్రమంలో నిరుడు నవంబర్ 11న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లగా రైతులు తిరగబడ్డారు. కొందరు ఆందోళనకారులు ఆయన కారుపై రాళ్లు రువ్వారు. ఆయనపై భౌతికదాడి జరగకపోయినా ముఖ్యమంత్రి అనుకూల మీడియా దాడి జరిగిందంటూ ప్రచారం చేయగా.. కలెక్టర్ దాన్ని ఖండించారు. ఆ రోజు రైతుల తిరుగుబాటును దృష్టిలో ఉంచుకొని.. పోలీసులు అర్ధరాత్రి లగచర్ల, ఆర్బీ తండా, పోలేపల్లి, పులిచెర్ల, హకీంపేట గ్రామాల్లోకి చొరబడి.. ఓ పథకం ప్రకారం బీఆర్ఎస్, బీజేపీ సానుభూతిపరులైన గిరిజన, దళిత రైతులను పట్టుకెళ్లి.. నానా చిత్రహింసలకు గురిచేశారు.
అడ్డువచ్చిన మహిళల పట్ల కొందరు ప్రైవేట్ సైన్యం, పోలీసులు వికృతంగా ప్రవర్తించారు. మహిళలను అస్యభ్యంగా తాకుతూ, ఇష్టారీతిన కొడుతూ దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీనిపై బాధిత మహిళలు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి.. బీఆర్ఎస్ సహకారంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ మొదలు, జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నాడు అర్ధరాత్రి జరిగిన దురాగతాలను వివరించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఎన్హెచ్ఆర్సీ రికార్డులో ఉన్న సమాచారం, ఇన్వెస్టిగేషన్ బృందం వాస్తవ దర్యాప్తు నివేదిక, సిఫారసులను కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. అందులో బాధితులు చేసిన చాలా ఆరోపణలు నిజమని, ఇటువంటి సున్నితమైన అంశాన్ని నిర్వహించడంలో పోలీసు అధికారులు అనుసరించిన విధానం చట్టపరంగా లేదని కనుగొన్నట్టు తెలిపింది. గ్రామస్తులను రాత్రి అరెస్టు చేసిన తర్వాత నిర్బంధించిన లాకప్, సీఐ ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, జీడీ ఎంట్రీలో వారి పేర్లు లేకపోవడం, పోలీసు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని సూచిస్తున్నదని ఘాటుగా స్పందించింది. దర్యాప్తు సమయంలో రాజకీయ కక్షసాధింపు కోణం కూడా బయటపడిందని, మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసినట్టు గుర్తించింది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ డివిజన్ బృందం ఇచ్చిన నివేదికలోని ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ సీఎస్, డీజీపీలను కింది ఆదేశాలపై ఆరు వారాలలో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
i. 11.11.2024 నాడు ప్రభుత్వ అధికారులపై దాడి చేయని నిర్దోషులైన గ్రామస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. వారి అంశాన్ని ప్రభుత్వ సంస్థలు పునఃపరిశీలించాలి.
ii. ప్రజల జీవనోపాధికి నేరుగా సంబంధం ఉన్న ఇటువంటి కీలకమైన అంశాల పట్ల పోలీసు లేదా పౌర అధికారులు సంయమనంతో వ్యవహరించాలని, మానవ హకులు ఉల్లంఘించకుండా చూడాలని ఆదేశించాలి. ప్రజల మధ్య భయరహితమైన, న్యాయమైన వాతావరణాన్ని సృష్టించడం పరిపాలనా విధి. కాబట్టి, అధికార దుర్వినియోగం, అతిగా బలప్రయోగం, పౌరులపై వేధింపులు ఉండకూడదు.
iii. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలి.