(వర్దెల్లి వెంకటేశ్వర్లు) హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక శాఖలు చాలక సహచర మంత్రుల శాఖల్లోకి తరచూ వేళ్లు పెడుతున్నారా? ప్రతి శాఖలో తన మనిషిని కీలకంగా పెట్టుకొని వ్యవహారం నడిపిస్తున్నారా? కాంట్రాక్టులు, కమిట్మెంట్లు, కమీషన్లు, కబ్జాలు.. ఏమైనా వన్‌మ్యాన్ షో అనే సంకేతాలిస్తున్నారా? బ్యూరోక్రాట్లకు పోస్టింగ్‌లు ఇస్తున్నప్పుడే.. తన ఆదేశం, లేదా తన ఆప్షన్‌లోని షాడో సీఎంవో నేతల ఆదేశాలు మాత్రమే అమలు చేయాలంటూ ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారా?
మంత్రులు, బ్యూరోక్రాట్ల మధ్య ఉద్దేశపూర్వకంగా అంతరాన్ని పెంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను.. మంత్రుల మాట వినకుండా చేస్తున్నారా? క్యాబినెట్ సహచరులకు, ముఖ్యమంత్రికి మధ్య ఏర్పడిన అగాథం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతున్నదా? సీనియర్ మంత్రులు ఒకవైపు, సీఎం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీ లిస్తే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లిపోతున్న నేపథ్యంలో గుడ్డిదీపం వెలుగులోనే ఇల్లు చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు.
పరిపాలనలో తమతో సంప్రదింపుల్లేవని, ప్రతి నిర్ణయం ఏకపక్షమేనని, ప్రతి పాలసీ వెనుక సొంత ప్రయోజనమే పరమావధిగా నిర్ణయాలు ఉంటున్నాయని మరో సీనియర్ మంత్రి కుండబద్దలు కొట్టారు. రూ.లక్షన్నర కోట్ల విలువైన మూసీ ప్రాజెక్టు టెండర్ అయినా.. రూ.5లక్షల కోట్ల విలువైన హిల్ట్ పాలసీ అయినా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు సంబంధించిన రూ.2వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ అయినా.. ఎంత తిన్నా తరగని గని సింగరేణి టెండర్ అయినా, చివరికి రూ.54 కోట్ల సెల్‌ఫోన్ కొనుగోళ్లు అయినా.. పని ఏదైనా ముఖ్యమంత్రి సూచించిన మనుషులు లేదా ఆయన బినామీలకు మాత్రమే పోతున్నాయని పేరు చెప్పటానికి ఇష్టపడని సీనియర్ మంత్రి ఒకరు వాపోయారు. ‘మీరు చేస్తున్నది ఆరోపణే కదా?’ అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ… ‘మీరు అడిగారు కాబట్టి, నేను చూసిన అంశాలను మీకు చెప్తున్నా’నని, ‘దాన్ని ఏది అనుకుంటే అదే’ అని గట్టిగా చెప్పడం గమనార్హం.
పోస్టింగ్తోపాటే ట్రైనింగ్
జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పోస్టింగ్‌లను, పొటెన్షియల్ రెవెన్యూ డివిజన్లలో అయితే ఆర్డీవోల పోస్టింగ్‌లను కూడా ముఖ్యమంత్రే ఆచితూచి ఇస్తున్నారని సీనియర్ మంత్రులు చెప్తున్నారు. సెక్రటేరియట్ స్థాయిలో ప్రతి హెచ్‌వోడీ, ఆయన సబార్డినేట్ పోస్టింగ్‌ల్లోనూ సీఎం జోక్యం చేసుకుంటున్నారని, ఫక్తు తనవాడే అని నిర్ధారణ అయిన తర్వాతే పోస్టింగ్‌లు ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ వ్యవహారమంతా సీఎంవోలో కీలకంగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కనుసన్నల్లో జరుగుతున్నదన్నది మంత్రుల మాట.
కలెక్టర్లకు, హెచ్వోడీలకు పోస్టింగ్ఆర్డర్
ఇచ్చేటప్పుడే సీఎం వారిని పిలిపించుకొని.. తాను గానీ, తన తరఫున సీఎంవోలోని కీలక అధికారి గానీ, లేదంటే షాడో సీఎంవోగా వ్యవహరిస్తున్న ఫలానా వాళ్లు గానీ ఫోన్చేస్తేనే పని చేయాలని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఒత్తిడి చేసినా తనకు చెప్పకుండా చేయవద్దని తేల్చిచెప్తున్నట్టు సీనియర్ మంత్రులే వెల్లడిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బ్యూరోక్రాట్ల్లు తమ మాట ఎందుకు వింటారని వారు వాపోతున్నారు. ఇటీవల జేసీ స్థాయి అధికారికి కూడా పోస్టింగ్ వేయించుకోలేకపోయానంటూ ఒక సహచర మంత్రి ఆవేదన వ్యక్తంచేయడాన్ని మరో మంత్రి గుర్తుచేశారు. ‘మంత్రులు, బ్యూరోక్రాట్ల మధ్య సఖ్యత ఉన్నదా? మంత్రులు చెప్పిన మాట ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వింటున్నరా? ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? ప్రతి శాఖలో ఎవరెవరో హెచ్వోడీలను చొప్పించి వ్యవహారాలు నడిపిస్తుంటే.. మేం సమాచారహకు చట్టం కింద ఫైళ్లు తెప్పించుకునే దుస్థితి తీసుకువచ్చారు’ అని ఒక మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.
టెండర్ ఏదైనా ఆయనదే నిర్ణయం
‘రూ. 5 లక్షల కోట్ల విలువైన హిల్ట్ పాలసీ ఓ వివాదస్పద పాలసీ. దీని మీద మంత్రికి పెత్తనం ఉండదు. అధికారులతో రివ్యూలు ఉండవు. మంత్రి కూర్చొని చేయాల్సిన రివ్యూలను.. డిప్యుటేషన్ మీద వచ్చిన సీఎంవో అధికారి చేస్తరా?’ అని ఓ మంత్రి తన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తంచేశారట. ఎక్సైజ్ శాఖలో ఇటీవల ఓ టెండర్ విషయంలో చెలరేగిన వివాదానికి సంబంధించి.. ఫైల్లో సీఎం జోక్యం చేసుకోవడాన్ని ఆయన గుర్తుచేశారట. ఆ వివాదంలో ఇప్పటికే ఓ ఐఏఎస్ వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ శాఖ మంత్రినే తొలగిస్తారని ఓ వర్గం సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తున్నది.
‘ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ వరకు వెళ్లడం ప్రభుత్వానికి అతిపెద్ద నష్టం. దీని ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మీద పడుతుంది’ అని సహచర మంత్రులు ఆందోళన వ్యక్తంచేశారు. రూ.54 కోట్ల సెల్ఫోన్ల టెండర్లో తన ప్రమేయం లేకుండానే సీఎంవో కార్యాలయమే టెండర్ ఖరారు చేసిందని, ఆ ఫోన్లు ఎంతకు కొన్నారు? వాటి ధర ఎంత? అనే వివరాలేవీ తనకు తెలియకుండానే టెండర్ ఖరారైపోయిందని ఒక మంత్రి ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇటీవల మహిళాశిశు సంక్షేమ శాఖలో కోడిగుడ్ల టెండర్న్రు ఖరారు చేసింది సీఎంవోనే అని.. నల్లగొండకు చెందిన కాంగ్రెస్ పెద్దాయన, ఆయన కొడుకుల సిఫార్సు మేరకు సీఎం కల్పించుకొని ఆ జిల్లాకే చెందిన కోళ్ల వ్యాపారికి టెండర్‌ను కట్టబెట్టారని మంత్రి ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
ఆమె శాఖలోనూ ఆటవిక పాలనే
ఇక ఓ మంత్రి, ఆమె కుమార్తె పెట్టిన పంచాయితీ ప్రపంచం అందరికీ తెలిసిందే. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో నేరుగా సీఎం సన్నిహితుడే కీలకంగా మారడం సంచలనంగానూ మారింది. ‘వాటా పంచాయితీలో తేడా వచ్చి, మా అమ్మకు సంబంధించిన దేవాలయ శాఖలోకి వేలు పెట్టి ఫైల్ ఆపారని’ సదరు మంత్రి కుమార్తె చేసిన ఆరోపణలు కేవలం దూషణలు కాదని, మంత్రుల మధ్య టెండర్ల పంచాయితీ, ముఖ్యమంత్రి సోదరుల భూదందా గురించి చెప్పిన నిజాలు అని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. ముఖ్యమంత్రి తన నిజాయితీని నిరూపించుకొనేందుకుగాను సదరు మంత్రి కుమార్తె చేసిన ఆరోపణలపై విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. మంత్రి కుమార్తె చెప్పిన నిజాలు బయటపెడితే.. సదరు మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం మొత్తం బయటపడుతుందని భయపడ్డారా? అని నిలదీశారు. ఇప్పటికీ అటవీశాఖలో సీఎం తరఫున ఒక అధికారే వ్యవహారం నడిపిస్తున్నారని, పోస్టింగ్‌లు, నిధుల కేటాయింపులు, ఖర్చులు, కాంట్రాక్టులు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు మరో సీనియర్ మంత్రి చెప్తున్నారు.
నోరేగానీ.. ఆయనా డమ్మీనే..
ఆర్టీఏలో మంత్రి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఆ శాఖ మంత్రి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం నమ్మకస్తుడు రాజ్యాంగేతర శక్తిగా మారి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఆర్టీఏలో మంత్రి మాటకు విలువ లేదు కానీ, సదరు రాజ్యాంగేతరశక్తి మాటే శాసనం అని చెప్తున్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయాయని, పైగా సదరు మంత్రి నోటి దురుసుతనంతోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె వరకు వచ్చారని సీఎం ఉల్టా ఆయననే నిందించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొంతకాలంపాటు ఆర్టీసీలో చిక్కీలు,మక్క బుట్టలు ఇచ్చే పథకం అమలైంది. మంత్రిగా తన ప్రమేయం లేకుండానే ఈ కాంట్రాక్టర్‌ను ఒక కీలక అధికారి ఆయన బంధువుల పేరుతో తీసుకున్నట్టు సదరు నేత తన అనుచరులతో చెప్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రవాణా శాఖలో చెక్ పోస్టుల రద్దు, ఏసీబీ దాడులు సదరు మంత్రి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయని, అప్పటినుంచే సదరు మంత్రికి ఆ శాఖ నిర్వహణ చేతగావడంలేదనేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టి, అసమర్థ ముద్ర అంటగట్టినట్టు చెప్తున్నారు. ఏం చేయాలన్నా పైనుంచే చేయాలనే సంకేతాలు పంపినట్టు చెప్తున్నారు.
సినిమాటోగ్రఫీ శాఖలోనూ షాడో సీఎంవో నాయకునిదే పెత్తనంగా మారినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు తన శాఖకు సంబందించి ఒక్క విధాపరమైన నిర్ణయమూ తాను తీసుకోలేదని సదరు మంత్రి చెప్పినట్టు తెలిసింది. ఇక, సినిమా వాళ్లయితే తనను ఆ శాఖా మంత్రిగా కూడా గుర్తించడంలేదని, తనకు ఆ శాఖ వద్దేవద్దు అని సదరు మంత్రి పట్టుబడుతున్నట్టు తెలిసింది. మరో మంత్రి ఇప్పటి వరకు ఒక్క పీఆర్వోను కూడా పెట్టుకోనట్టు తెలిసింది. తనకు ప్రొటోకాల్ ఉంటే చాలని, శాఖాపరమైన వ్యవహారాలను ముఖ్యమంత్రినే చూసుకొమ్మని తెగేసి చెప్పినట్టు తెలిసింది.
ప్రైవేట్ సంభాషణల్లో మంత్రి అసహనం
టీడీపీ నుంచి ‘ముఖ్య’నేతతోపాటు వచ్చిన ఓ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తాను అనుకోవడంలేదని కుండబద్ధలు కొట్టారు. ఎప్పటికైనా ఆ ‘ముఖ్య’నేత బీజేపీలోకి వెళ్లడం ఖాయమని అభిప్రాయపడ్డారు. మేము పేరుకే మంత్రులం. ప్రభుత్వ కార్యక్రమాలకు సీఎం వెంట వెళ్తూ ఉత్సవ విగ్రహాల్లా నిలబడటానికే అన్నట్టుగా ఉన్నాం అని ఓ మంత్రి అంటే.. అన్ని శాఖల్లో సీఎం షాడో మంత్రులను పెట్టుకొన్నారని మరో మంత్రి వాపోయారు. తన శాఖకు సంబంధించి ఓ భూముల వ్యవహారంపై మీడియాలో వార్త వస్తే, దీని గురించి నోట్ అడిగితే సదరు హెచ్‌వోడీ వారంరోజులైనా ఆ నోట్ పంపలేదని మరో మంత్రి వాపోయారు. ఒక మంత్రి తన అసహనాన్ని తట్టుకోలేక తన అసంతృప్తిని ప్రైవేట్ సంభాషణల్లో వ్యక్తంచేసినట్టు తెలిసింది.
గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్టు
తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలోనే మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార వైఎస్ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. మిగిలినవారికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన అపార అనుభవం ఉంది. గతంలో ఏ సీఎం కూడా తమను ఈ రకంగా కట్టడి చేసిన దాఖలాలు లేవని పలువురు మంత్రులు వాపోతున్నారు. ఇలాంటి అవమానకరమైన పరిస్థితులను తామెన్నడూ ఎదురొనలేదని చెప్తున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత, అనుభవరాహిత్యానికి నిదర్శనమని తప్పుపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అంటే అది మంత్రిమండలి నిర్ణయంగానే చూస్తారు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలలో సీఎంకు ఎంతటి బాధ్యత ఉంటుందో మంత్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది.
కానీ ఏకపక్ష నిర్ణయాలతో కర్రపెత్తనం చేస్తున్నారని సీనియర్ మంత్రులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సీఎం అనాలోచిత, ఆధిపత్య నిర్ణయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అకడే తేల్చుకుంటామని సీనియర్ మంత్రి ఒకరు అన్నారు. గుడ్డు వచ్చి పిల్లను వెకిరించినట్టుగా ఉంది తమ పరిస్థితి అని మరో సీనియర్ మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం తప్ప మంత్రులంతా డమ్మీలేనన్న సంకేతాలు ప్రజలు, అధికారులకు ఇచ్చినట్టు అయ్యిందని ఆయన మండిపడ్డారు. విజయాలను అన్నీ తన ఖాతాలో వేసుకొని, వైఫల్యాలు మాత్రం తమ నెత్తిన నెడుతున్నారని మరో మంత్రి వాపోయారు. ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, ఆర్టీసీ సమ్మె వంటి వ్యవహారాల్లో సీఎం వైఖరిని ఆయన ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని రెండు రకాలుగా చూస్తున్నామని ఒక మంత్రి విశ్లేషించారు. తన సహచర మంత్రులపై సీఎంకు ఏమాత్రం నమ్మకం లేకపోవడం, వారి అనుభవాన్ని గౌరవించకపోవడం ఒకటైతే.. రెండోది ప్రజల దృష్టిలో మంత్రులంతా డమ్మీలన్న అభిప్రాయం కల్పించడమేనని వ్యాఖ్యానించారు.
అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర
కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడం ఆ పార్టీ నేతలకున్న ప్రత్యేకత. పార్టీ పెద్దలంతా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపితే, ఆయనపై శశిథరూర్ పోటీకి దిగిన ఉదంతాన్ని చూశాం. అంతెందుకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటననే ఆ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా తప్పుపట్టిన తీరును చూశాం. అంతటి అంతర్గత ప్రజాస్యామ్యం ఉండే కాంగ్రెస్‌లో.. మంత్రుల మీద కర్రపెత్తనం చేసే సంస్కృతి ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? తెలంగాణలో మాత్రమే అది జరుగుతున్నదని సీనియర్లు మంత్రులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్సార్ క్యాబినెట్లోనే మంత్రులుగా పని చేసిన అనుభవజ్ఞులు. దామోదర రాజనరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా, భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. వైఎస్ఆర్, రోశయ్య లాంటి ఉద్ధండులకు సలహాలు, సూచనలు ఇచ్చిన అపార అనుభవజ్ఞులు. అటువంటి తమ మీద ఏ అనుభవం లేని ముఖ్యమంత్రి పెత్తనం చేస్తుంటే, పిల్లొచ్చి గుడ్డును వెకిరించినట్టు ఉంది తమ పరిస్థితి అని మరో సీనియర్ మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రే సారథి. అనుమానం లేదు. ప్రజాస్వామ్యబద్ధమైతే.. ఆయన నియమించిన వారే మంత్రి వర్గంలోకి వస్తారు. అట్లాగే ముఖ్యమంత్రిపై విశ్వాసం కోల్పోయిన మంత్రులూ క్యాబినెట్లో ఉండలేరు. కానీ అది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడినుంచైనా మంత్రులు వస్తారు.. పోతారు. కానీ తెలంగాణ క్యాబినెట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అటు ముఖ్యమంత్రిపై నమ్మకం కోల్పోయిన మంత్రులు.. ఇటు ముఖ్యమంత్రిని కూడా నమ్మని మంత్రివర్గం కనిపిస్తున్నదని సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేల మీద పైరవీకారుల అపవాదు
‘సీఎంగా ఆయన మాకెక్కడ స్వేచ్ఛ ఇచ్చారు? ఎమ్మెల్యేలకు నిధులివ్వకుండా ప్రజల్లో డమ్మీలను చేశారు. ఎమ్మెల్యేలు ఇంటికి వస్తే.. కనీసం వారిని కలువకుండానే వేం నరేందర్‌రెడ్డి వద్దకు పంపిస్తున్నట్టు మరో సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. ‘మేము నియోజకవర్గం పనుల కోసం రావడం లేదట, పైరవీలు పట్టుకొని ఆయన ఇంటికి పోతున్నామట. అందుకే తమను కలువటం ఆయన ఇష్టం లేదని ఆయనకు సంబంధించిన వ్యక్తులు మా ముఖమ్మీదనే చెప్తున్నారు’ అని సదరు ఎమ్మెల్యే వాపోయారు.
‘సీఎం మమ్మల్ని నేరుగా కలిస్తే..నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారో, మేమెన్ని సొంత పైరవీలు చేసుకున్నామో నిలదీస్తాం’ అని మరో ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయారు. ‘నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇవ్వమని అడిగితే.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, నియోజకవర్గం ఫండ్‌కు బదులుగా ప్రతి ఎమ్మెల్యే నెలకు రూ. 5 కోట్ల చొప్పున కాంట్రాక్టు బిల్లులు తెచ్చుకొని కమీషన్లు తీసుకోవాలని సూచించింది ముఖ్యమంత్రి కాదా?’ అని మరో ఎమ్మెల్యే నిలదీశారు. అవి కూడా రెండు, మూడు నెలలు మాత్రమే ఇచ్చి, ఇప్పుడు అసలే ముఖం చూపించటం లేదని, పైగా తామేదో పైరవీల కోసం వస్తున్నామనే నిందలతో ఆయన అనుకూల మీడియాలో గురివింద రాతలు రాయించుకుంటున్నారని సదరు ఎమ్మెల్యే ఆరోపించారు.