పహల్గాం దురాగతానికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సీఎం రేవంత్, మంత్రులు, సైనికాధికారులు, రిటైర్డ్ జవాన్లు సైన్యానికి మద్దతుగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 8(నమస్తే తెలంగాణ): ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందకు పోరాడుతున్న భారత సైన్యానికి తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పాక్ పాలకులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలనే చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించిన సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం నుంచి నెక్లెస్‌రోడ్డు వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘మా నేలపై కాలుమోపి మా ఆడబిడ్డల నుదిటి సిందూరాన్ని తుడిచేయాలనుకునే ఉగ్రమూకలకు ఆపరేషన్ సిందూరే సమాధానం’ అని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, క్లిష్ట సమయాల్లో పార్టీలు, జెండాలు, ఎజెండాలను పక్కనబెట్టి దేశరక్షణకై అంతా ఒకటి కావాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి, శ్రీధర్‌బాబు, పొన్నం మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు.