మహబూబ్‌నగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని, అందరూ కష్టపడి పనిచేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో మంగళవారం ఆయన నీటి పారుదల, వైద్య, ఆరోగ్య శాఖ, విద్య, సంక్షేమం, పర్యాటక శాఖలపై సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రాజెక్టుల పనుల పురోగతిపై నివేదిక అందించాలని ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను పూర్తి చేయాలని చెప్పారు.
పాలమూరు లిఫ్ట్ పనులు తప్ప ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ నుంచి గ్రామపంచాయతీ వరకు త్వరలో ఫేస్ రికగ్నిషన్ యాప్ తీసుకొస్తామని, సచివాలయంలో హాజరు పరిశీలిస్తామని చెప్పారు. ఉద్యోగులు డుమ్మా కొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాశాఖలో అందరికీ ప్రమోషన్లు, బదిలీలు చేశామని చెప్పారు. ఇకపై తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాననని చెప్పారు. కలెక్టర్ వారానికి ఓసారి దవాఖానలు, పాఠశాలలు తనిఖీ చేయాలని, డీఈవో, ఎంఈవోలు ప్రతిరోజు పాఠశాలలను విజిట్ చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం రూ.353.66 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సమీక్షలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారులు పాల్గొన్నారు.
పాలమూరు కలెక్టరేట్లో జరిగిన ప్రభుత్వ అధికారిక సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొనడం చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే సంపత్, పీసీసీ కార్యదర్శి వినోద్, గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఈ రివ్యూకు హాజరయ్యారు. కాగా రివ్యూ జరిగినంత సేపు కరెంట్ పోకుండా విద్యుత్ అధికారులు తంటాలు పడ్డారు. సీఎం పాల్గొన్న కార్యక్రమాల్లో ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, తూడి మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజేయుడు, ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.