హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘నేను ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నాను. ఈ పర్యటనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదు. లోక్‌సభ సమావేశాల్లో పాటించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చించి, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి నిధులు రాబడతాం’.. సోమవారం తన నివాసంలో ప్రెస్‌మీట్ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, చేసిన ప్రకటనకు భిన్నంగా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, ప్రియాంకగాంధీ తదితరులను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌రెడ్డి, రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం బృందం కలిసింది. దీంతో సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఒకటి చెప్పి, ఢిల్లీ వెళ్లాక మరొకటి చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తానని చెప్పి కాంగ్రెస్ నేతలతో మంతనాలు ఎందుకు జరిపారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏం చర్చించారో, ఏం సాధించారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కుల గణన సర్వే 92 శాతం పూర్తి
‘దేశవ్యాప్తంగా కులగణన’ అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే మూడో దశ సామాజిక న్యాయ ఉద్యమమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి దశలో నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటివి సాధిస్తే, రెండో దశలో రాజీవ్‌గాంధీ హయాంలో 18 ఏండ్లకే ఓటుహకు, మండల్ కమిషన్ నివేదిక వంటివి పూర్తయ్యాయని, ఇప్పుడు మూడో దశలో సోనియాగాంధీ, మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో కులగణన ప్రారంభం అయిందని తెలిపారు. తెలంగాణలో నిర్వహిస్తున్న సర్వే 92 శాతం పూర్తయిందని వివరించారు.
జస్టిస్ జగన్నాథరావు మృతికి సంతాపం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథరావు మృతికి సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. పలు న్యాయస్థాయాల్లో పనిచేసిన ఆయన కీలక కేసుల పరిష్కారంలో తనదైన ముద్రవేశారని కొనియాడారు. జగన్నాథరావు కుమారుడు, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.