హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నాలుగు కోట్ల ప్రజల ఆలోచన మేరకే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది. నాంపల్లిలో జరిగిన ప్రజాపాలన వేడుకల్లో సీఎం మాట్లాడుతూ.. అధికారికంగా మొదటిసారి వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అయితే నిజాం సంస్థానం భారత ప్రభుత్వంలో కలిసి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ‘జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు’ పేరుతో ఏడాది పాటు నిర్వహించలేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని గుర్తుచేశారు. కాబట్టి మొదటిసారి అధికారికంగా చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ప్రజల ఆకాంక్ష, ఆలోచనమేరకే ప్రజాపాలన అనే పేరు పెట్టామని చెప్పడంపైనా ఎద్దేవా చేస్తున్నారు. ఫలానా పేరు పెడతామని నాలుగు కోట్ల మంది ప్రజల నుంచి ఎప్పుడు అభిప్రాయ సేకరణ చేశారని ప్రశ్నిస్తున్నారు. కనీసం మంత్రివర్గంలో కూడా చర్చించకుండా.. ప్రజలకు ముందుగా తెలిసేలా ఒక ప్రకటన కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకొని, మళ్లీ ప్రజలపై రుద్దుతారా? అంటూ మండిపడుతున్నా రు. పథకాల అమలుకు ఆమోదం కోసం, పీసీసీ అధ్యక్ష పదవి కోసం, మంత్రివర్గ విస్తరణ కోసం.. ఇలా ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ హక్కుల పేరు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నా రు. తూతూమంత్రంగా కేంద్ర మంత్రుల ను కలిసి వినతిపత్రాలు ఇచ్చినంత మా త్రాన రాజకీయ పర్యటనలు అధికారిక ప ర్యటనలుగా మారవని స్పష్టం చేస్తున్నారు.