Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు అప్పుకోసం మరోసారి రిజర్వు బ్యాంకు తలుపు తట్టింది. మరో రూ.2,500 కోట్లు అప్పుచేసింది. ఈ విషయాన్ని ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.42,118 కోట్ల రుణం పొందింది.
తాజాగా రూ.2,500 కోట్లతో కలిపి ఇప్పటివరకు రేవంత్రెడ్డి సర్కారు ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు అక్షరాల రూ.44,618 కోట్లకు చేరింది. గత ఏడాది డిసెంబర్ 12న రూ.500 కోట్లతో మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి రుణాలు పొందుతూనే ఉన్నది. ఇలా ప్రతి నెలా రూ.5 నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు సేకరిస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం-మేడారంలోని అడవుల్లో అరుదైన సంఘటన చోటుచేసుకున్నది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రే 50 వేలకుపైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల్లో ఆగస్టు 31 సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. దీనిపై అటవీ, వాతావరణ శాఖల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులతో టోర్నడోలు ఏర్పడటంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. దీనిపై లోతైన పరిశీలన జరిపేందుకు శాటిలైట్ డాటాతోపాటు ఇతర పరికరాల సాయంతో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఒకేసారి వేల సంఖ్యలో చెట్లు కూలిపోవడం ఇదే మొదటిసారని, 50 నుంచి 100 మైళ్ల వేగంతో తీవ్రమైన గాలులు వీయడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆయన చెప్పారు.