CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): శ్వేతపత్రం విడుదల చేసింది ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు కాదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, కష్టమైనా సరే నిస్సహాయులకు అండగా ఉం టామని తెలిపేందుకేనని వెల్లడించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలనేదే తమ ఉద్దేశమని, వాస్తవాలను ప్రజలకు తెలిపి ముందుకు వెళ్లాలని భావిస్తున్నామని అన్నారు. శ్వేతపత్రం విడుదలలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని, ఎవరినో కించపరచాలనో, ఎవరినో తక్కువ చేయాలనే ఆలోచన లేదని తెలిపారు. శ్వేతపత్రం ద్వారా వాస్తవాలను తెలియజేయటం కొంతమందికి చేదుగా ఉండొచ్చని అన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఆర్బీఐ వద్ద 303 రోజులు మిగులు బడ్జెట్ ఉంటే గత ఐదేండ్లలో ఏ సంవత్సరం కూడా రోజువారీ మిగులు బడ్జెట్ లేదని వెల్లడించారు. ప్రతి రోజు ఆర్బీఐ వద్ద అడుక్కునే పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం రాష్ట్ర అధికారులు తయారు చేయలేదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికారులను ఈ విధంగా అవమానించడం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వం పంపిన ఫార్మాట్ ఆధారంగా ప్రతి శాఖ కార్యదర్శి సంతకం చేసిన ఇచ్చిన లెక్కలనే శ్వేతపత్రంలో పొందుపర్చామని తెలిపారు. తాము అధికారులపై కక్షపూరితంగా వ్యవహరించబోమని, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తమను కలుస్తారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచన ఉంది కాబట్టే తానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రధానిని కలిసేందుకు సహకరించాలని కోరామని అన్నారు.
తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండబోవని, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సభలో అఖిలపక్షం ముందు పెట్టి, చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నాకే చట్టాలు చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ అభివృద్ధిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశానికి అన్ని పార్టీలతోపాటు ప్రజాసంఘాలను కూడా ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు.
ఆదాయ, వ్యయాలకు కాగ్ లెక్కల్ని, రుణాలు, అ డ్వాన్స్లకు సంబంధించి ఆర్బీఐ లెక్కల్ని తీసుకొన్నట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. పదేండ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, బీఆర్ఎస్ సభ్యులు అబద్ధాలతో సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అందినకాడికి అప్పులు చేశారని విమర్శించారు. ఔట ర్ రింగురోడ్డును రూ.6,500 కోట్లతో నిర్మిస్తే, దాన్ని రూ.7,700 కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు. కేజీ టు పీజీ కార్యరూపం దాల్చలేదని, గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమ లు చేయలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసెస్మెంట్ వ్యాల్యూ రూ.1,23,872 కోట్లు కాగా, అందులో రూ.96,876 కోట్ల పనులు పూర్తయ్యాయని, ఇందు లో రూ.32,076 కోట్లు బడ్జెట్ నుంచి, మిగిలిన మొ త్తం కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకున్నారని వివరించారు. జూబ్లీ బస్టాండ్సహా పలు ఆర్టీసీ డిపోలు, ఇతర ఆస్తులు తనఖా పెట్టి రూ.2,886 కోట్లు, జెన్కో ఆస్తులపై రూ.2,100 కోట్లు, ఎన్‌పీడీసీఎల్‌పై రూ. 2,872 కోట్ల అప్పులు తీసుకున్నారని చెప్పారు.
శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు ఉన్నాయని, అసలు శ్వేతపత్రం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాలన్న అక్బరుద్దీన్ డిమాండ్‌పై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అప్పులు చేయడం తప్పు కాదని చెప్పడం గమనార్హం. అప్పులు చేయనిదే ఏ రాష్ట్రమూ ముందుకు పోదని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ రోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణం.. స్టేట్ ఏదో డెఫిసిట్‌లోకి పోతుందని, రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితులో ఉందని, ఆర్థిక పరిస్థితులు బాగాలేవని గ్లోబల్ లెవల్లో ఫోకస్ చేయడానికి కాదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏండ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే. అప్పలు చేయనిదే ఏ రాష్ట్రమూ ముందుకు పోదు’ అని తెలిపారు.