హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : నిరుడు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో 17 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా, ఏడు ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16 నుంచి 22 వరకు విదేశీ పర్యటనలు నిర్వహించనున్న నేపథ్యంలో నిరుటి పెట్టుబడులపై సోమవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.నిరుడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయో అడిగి తెలుసుకున్నారు. దావోస్‌లో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 14 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శిఅజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయ్‌పోల్ గ్రామంలోని సర్వే నం.221లోని 3.20 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణలో అధికారులు విఫలమవుతున్నారంటూ బహుజన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. హైకోర్టులో పిటిషన్ వేశారు.. దీనిపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వానికి చెందిన 3.2 ఎకరాల భూమి ఆక్రమణలకు గురవుతున్నదని, శ్రీ ఇందూ ఇంజినీరింగ్ కాలేజీ ఆక్రమించుకున్నదని 2023 సెప్టెంబర్‌లో, 2024 మార్చిలోను వినతిపత్రాలు సమర్పించినా కలెక్టర్, ఆర్డీవో, తాసీల్దార్ చర్యలు తీసుకోవడంలేదని తెలిపారు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ విధుల నిర్వహణలో అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి, అధికారులకు, ఇందూ కాలేజీకి నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. సర్వే నం.221లోని 3.2 ఎకరాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. నవీన్ మిట్టల్‌పై వ్యక్తిగతంగా తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత హోదాలో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేస్తూ విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేశారు.