హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ తొలినుంచి మతసామరస్యానికి, ప్రశాంతతకు మారు పేరని, దాన్ని మరింత ఇనుమడింపజేసేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ నిర్వహణపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. రెండు పండుగలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, నీటి పారుదల, విద్యుత్తు శాఖలతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
మండప నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఉచిత విద్యుత్తుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా విద్యుత్తును వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల్లో డీజేలు వాడేందుకు అనుమతివ్వాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరగా, సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్‌అలీ, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
సీఎం నిర్వహించిన సమీక్షలో జీహెచ్ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్ వంటివారిని సమావేశానికి పిలవకపోవడం గమనార్హం. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగరం పరిధిలోని నలుగురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు. సీఎంకు, సిటీ ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబరు 19న మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురసరించుకొని వచ్చే నెల 16న వేడుకలు నిర్వహించాలని కమిటీ తొలుత నిర్ణయించింది. సెప్టెంబరు 7నుంచి గణేశ్ నవరాత్రోత్స వాలు, 17న నిమజ్జనం విషయం సీఎం సమీక్షలో చర్చకు వచ్చింది. దీంతో మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం, మంత్రులు సూచించగా మిలాద్ కమిటీ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు.