హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరద నష్టం కింద రూ.11,713.49 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని, మెట్రోరైలు రెండో దశకు సహకారం అందించాలని కోరారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అనంతరం హోం మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీవర్షాల వల్ల వాటిల్లిన నష్టా న్ని అమిత్‌షాకు వివరించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి చేర్చాలని కోరారు. అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటుచేయాలని విన్నవించా రు. ఎస్పీవోల పెండింగ్ నిధులు విడుదల చేయాలని, 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని కోరారు.
తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో శిక్షణకు అదనంగా రూ.25.59 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని విడుదలచేయాలని, రాష్ట్ర విభజన సమస్యల పరిషారానికి సహకరించాలని కోరారు. తెలంగాణకు అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మా ణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని కోరారు. మూసీలో మురుగు చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో రూపొందించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రికి అందజేశారు. డీపీఆర్‌ను ఆమోదించడంతోపాటు పనుల అనుమతికి చొరవ చూపాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు రూ.24,269 కోట్ల వ్యయంతో డీపీఆర్‌ను సమర్పిస్తామని, అది త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని ఖట్టర్‌ను కోరా రు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, వంశీకృష్ణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, ముఖ్య కార్యదర్శులు వీ శేషాద్రి, దానకిశోర్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.