నాగర్‌కర్నూల్, మే 19 : అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ 100 రోజు ల్లో ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇంది ర సౌర గిరి జల వికాస పథకం గిరిజనులకు వరంలాంటిదని చెప్పారు. రూ.12,600 కోట్ల తో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో సీఎం సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు.
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా రాణించిన జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పుట్టిన ప్రాంతం నల్లమల అని, తాను నల్లమల బిడ్డను కావడం గర్వం గా ఉన్నదని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే.. వెంటవెంటనే వద్దు.. సమయం ఇవ్వాలని నిరుద్యోగులే కోరుతున్నారని, అందుకే నోటిఫికేషన్లు వెంటవెంటనే వేయడం లేదని చెప్పారు.
లబ్ధిదారులతో ముఖాముఖిలో ఉపాధి కూలీ డబ్బులు ఆలస్యంగా వస్తున్నాయని సీఎం దృష్టికి మహిళలు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వారికి సమాధానం చెప్పడంలో కాస్త తడబడ్డారు. డబ్బులు త్వరగా వచ్చేలా చేస్తామని, కేంద్రం నుంచి వచ్చేది ఉన్నదని, వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పుకొచ్చారు.