హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): నేత కార్మికులకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటలు నీటి మూటలయ్యాయి. నిరుడు సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఎన్ఐహెచ్టీ) ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. నేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రూ.33 కోట్లు నిధులు కేటాయిస్తామని తెలిపారు. రుణమాఫీ వల్ల 7000మంది కార్మికులకు లబ్ధి కలుగుతుందని చెప్పుకొచ్చారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు.
రుణమాఫీపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు పూటకో మాట మాట్లాతున్నారు. తొలుత రూ.33 కోట్లు మంజూరు చేస్తూ.. ఏడాది మార్చిలో ఉత్తర్వులు మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత చేనేత శాఖ అధికారులు మాట మార్చారు. తొలుత పంపిన ప్రతిపాదనలలో మరో రూ.15 కోట్లు కలిపి, రూ.48 కోట్ల ప్రతిపాదనలతో ఆర్థికశాఖకు కొత్త ఫైల్ పంపారు. రుణమాఫీపై చేనేతశాఖ ఉన్నతాధికారులకే స్పష్టత లేదని, ఆ మాఫీ సంగతి తర్వాత చూద్దామంటూ ఫైల్‌పై ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కొర్రీ పెట్టినట్టు తెలిసింది. దీంతో నేతన్నల రుణమాఫీ కథ అటకెక్కినట్టేనని సమాచారం.
రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయాల్సిందే. రుణమాఫీ గురించి మంత్రులు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. ఎవరిలోనూ చలనం కనిపించడంలేదు. వెంటనే రుణమాఫీ చేయకపోతే సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతాం.
-వనం శాంతికుమార్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు