CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై తమ మధ్య ఏకాభిప్రాయమే ఉన్నదని, మరి ఎందుకు ఆలస్యం అవుతున్నదో ఏఐసీసీ పెద్దలనే అడగాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో గురువారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్ విస్తరణపై తాను ఎప్పుడూ తేదీలు చెప్పలేదని అన్నారు. మీడియా వాళ్లే మంత్రివర్గ విస్తరణ చేసి, శాఖలు కూడా పంచి, మళ్లీ వాళ్లే వాయిదా వేశారని పేర్కొన్నారు. ఈ నెల 7న తన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగుస్తున్నదని, అందుకే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఏఐసీసీ పెద్దలను కోరారని చెప్పారు. ఇప్పుడు ఈ అంశం ఏఐసీసీ కోర్టులో ఉన్నదని తెలిపారు.
2029 వరకూ అధికారంలో మేమే
తెలంగాణలో 2029 వరకూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో పదేండ్లకోసారి, ఆంధ్రలో ఐదేండ్లకోసారి అధికార మార్పిడి జరిగే ట్రెండ్ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఈ లెక్కన తామే పదేండ్లు అధికారంలో ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదని, టార్చ్‌లైట్ వేసి వెతికినా కనిపించదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్దంతా గత చరిత్ర అని, భవిష్యత్ లేదని పేర్కొన్నారు.
బీజేపీ నేతలు ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. 11 రాష్ర్టాల్లో బీజేపీ ఎంతోమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పట్ల బీజేపీ నేతలకు, ఈటల రాజేందర్‌కు సానుభూతి ఎందుకో చెప్పాలని పేర్కొన్నారు. ఈటల ఇప్పటికీ కేసీఆర్‌నే తన నాయకుడిగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల వరకే రాజకీయాలు
రాజకీయాలు ఎన్నికల వరకేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా, కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమితాషాను కోరినట్టు వివరించారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజున రిజర్వులో ఉంచే 15% ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వీటిని మారిస్తే ఎవరికీ తెలిసే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు.
ఐదు విలీన గ్రామాలను తిరిగి కలపాలని కోరాం
భద్రాచలంమండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపా రు. సాధ్యమైనంత వరకు అన్ని అంశాల ను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని వెల్లడించారు.విభజనచట్టంలో ఇచ్చి న హామీలను నెరవేర్చాలని కోరామని తెలిపారు. తెలుగు రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అవుతున్న విషయాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. ‘మీ వంతుగా ప్రయత్నం చేయండి, అప్పటికీ పరిష్కారం కాకుంటే తాము చొరవ తీసుకుంటాం’ అని అమిత్‌షా చెప్పారని రేవంత్‌రెడ్డి వివరించారు.