హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేయనున్నదా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. పెన్షన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల్లో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల అమలుకు ఇకపై ఫేస్ రికగ్నైజేషన్(లబ్ధిదారుల ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తద్వారా అర్హులెవరో, అనర్హులెవరో తేల్చుతామని స్పష్టంచేశారు. దీని ఆధారంగా ఎంత మంది ఉంటా రు? ఎన్ని నిధులు కావాలో లెక్కిస్తామని తెలిపారు. అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఫేస్ రికగ్నైజేషన్ అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
కొత్త స్కీములు పెట్టరు. ఉన్న పథకాలు పట్టవు. జనం దుమ్మెత్తిపోస్తున్నా.. ఇస్తామన్న ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు ఇక ఉన్న పథకాలపై పడింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకూ, అన్నిరకాల పెన్షన్‌దారులకు ఇకపై ఫేషియల్ రికగ్నైజేషన్ను అమలు చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రే అసలు విషయం వెల్లడించారు. అదే జరిగితే రాష్ట్రంలోని 42.85 లక్షలమంది పింఛనుదారులపై దాని ప్రభావం పడనున్నది. పథకాల లబ్ధిదారులైతే ఆ సంఖ్య కోట్లల్లో ఉండనున్నది.
సంక్షేమ పథకాల అమలుకు ఫేస్ రికగ్నైజేషన్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో పెన్షన్, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. సీఎం చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది కచ్చితంగా లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకు చేస్తున్న కుట్రేనని చెప్తున్నారు. ఇప్పటికే ఖజానా ఖాళీ అంటూ బీద అరుపులు అరుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఫేస్ రికగ్నైజేషన్ అమలు నెపంతో కొర్రీలు పెట్టి, షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడం ఖాయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేల పెన్షన్ ఇస్తామంటూ గొప్పగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా ఇప్పటి వరకు పెన్షన్ల పెంపుపై అతీగతీ లేకుండా పోయింది. పైగా ఇప్పుడు ఉన్న పెన్షన్లలో కోత పెట్టేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.
వ్యవసాయం, అనుబం ధ శాఖలు, కార్పొరేషన్ల కార్యాలయా ల్లో ఉద్యోగుల హాజరుపై బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏ ర్పాటు చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేందర్మోహన్ హెచ్వోడీలకు ఆదేశాలు జారీచేశారు. విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై తీసుకున్న యాక్షన్ రిపోర్టులు కూడా అందించాలని ఆదేశించారు. మంత్రి తుమ్మల సూచనల మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి ఐటీ శాఖ వర్గాలతో మాట్లాడి డాష్‌బోర్డు ఏర్పాటు, ఉద్యోగుల హాజరు వివరాలు, ఆన్లైన్లో ఉంచడం వంటి పలు ఆసక్తికరమైన విషయాలపై సూచనలు చేశారు.
2.5 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కారు పెను కుట్రకు తెరలేపింది. మెజారిటీ వ్య క్తుల్ని ఉద్యోగాల నుంచి ఊడ దీసేందుకు తెరవెనుక చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ గురువారం కీలక నిర్ణయం వెల్లడించా రు. అన్ని శాఖల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఉద్యోగుల నుంచి ఆధార్‌కార్డులు, వేతనాల వి వరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగుల్లో కోత పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.